జాలిమంచిలో పట్టపగలే చోరీ
ఆదోని రూరల్: పట్టపగలే జాలిమంచి గ్రామంలో చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన ఇంట్లో దొంగలు చొరబడి ఆరున్నర తులాల బంగారం, 60 తులాల వెండితో పాటు రూ.2 లక్షల నగదును చోరీ చేసినట్లు బాధితుడు బోయ రంగారెడ్డి తెలిపారు. శనివారం మధ్యాహ్నం చోరీ జరిగిందని, బాధితుడి ఫిర్యాదు మేరకు ఆదివారం పోలీసులు విచారణ చేపట్టారు.
రేపు బ్యాంకుల సమ్మె
కర్నూలు(అగ్రికల్చర్): బ్యాంకుల సమ్మెను ఈ నెల 27న నిర్వహిస్తున్నట్లు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(యుఎఫ్‌బీయూ) జిల్లా కన్వీనర్ ఈ.నాగరాజు తెలిపారు. వారంలో ఐదు రోజుల పని దినాల కోసం చేపట్టిన సమ్మెలో కార్పొరేట్ బ్యాంకులు మినహా అన్ని బ్యాంకులు పాల్గొంటాయని ఆదివారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బ్యాంకుల సమ్మె సందర్భంగా 27న కర్నూలులోని ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచి ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలిపారు.
కర్నూలు ఏరువాక కేంద్రానికి ‘ఉత్తమ’ అవార్డు
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉన్న ఏరువాక కేంద్రానికి ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రాష్ట్రస్థాయి ఉత్తమ పురస్కారం లభించింది. 2024–25 సంవత్సరానికి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఏరువాక కేంద్రంగా ఎంపికై ంది. ఏరువాక కేంద్రం ప్రోగ్రామ్ కో–ఆర్డినేటర్ సుజాతమ్మ, ఇతర శాస్త్రవేత్తలు నిత్యం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ.. రైతులకు ఎప్పటికపుడు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. రైతులకు అందుతున్న సేవలకు గుర్తింపుగా రాష్ట్ర స్థాయి ఉత్తమ పురస్కారానికి కర్నూలు ఏరువాక కేంద్రం ఎంపిక అయ్యింది. గుంటూరులో ఈ నెల 29న జరిగే కార్యక్రమంలో ప్రోగ్రామ్ కో–ఆర్డినేటర్ సుజాతమ్మ ఉత్తమ పురస్కారాన్ని అందుకోనున్నారు.
పొగాకు రైతులకు లభించని గిట్టుబాటు ధర
కర్నూలు(అగ్రికల్చర్): పొగాకు సాగులో పెట్టుబడి వ్యయం భారీగా పెరిగింది. క్వింటాకు కనీసం రూ.18,000 ధర లభిస్తేనే రైతులకు గిట్టుబాటు అవుతుంది. అయితే పొగాకు కంపెనీల అసోసియేషన్ మాత్రం క్వింటాలుకు కేవలం రూ.1,6500 ధరను నిర్ణయించింది. పొగాకు కంపెనీలు పెట్టుబడి వ్యయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా.. అంతంతమాత్రం ధరను నిర్ణయించడంపై రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. గత ఏడాది రూ.1,5500 ధర ఉంది. ఈ ధరకు కనీసం 10 శాతం పెంచాలని రైతులకు కోరుతున్నారు. 2024–25లో పొగాకు సాగు చేసిన రైతులు గతంలో ఎపుడూ లేని విధంగా నష్టాలు మూట కట్టుకున్నారు. కొనేవారు లేక దాదాపు 50 వేల క్వింటాళ్ల పొగాకును పారబోశారు. గత ఏడాది నష్టపోయిన రైతులు 2025–26లో పొగాకు సాగు తగ్గించారు. పెట్టుబడి వ్యయం పెరిగినా కంపెనీలు నిర్ణయించిన ధర సాగు ఖర్చులకు అనుగుణంగా లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎయిడెడ్ స్కూళ్లలో టీచర్ పోస్టులకు రాత పరీక్ష
కర్నూలు సిటీ: జిల్లాలోని మూడు ఎయిడెడ్ స్కూళ్లలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు ఆదివారం రాత పరీక్ష నిర్వహించారు. కేవీ సుబ్బారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలోని ఐయాన్ డిజిటల్ జోన్‌లో ఆన్‌లైన్‌లో రాత పరీక్ష నిర్వహించారు. ఉదయం మసూదియా అరబిక్ ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో ఖాళీగా ఉన్న తెలుగు స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు 76 మంది అభ్యర్థులకుగాను 38 మంది హాజరయ్యారు. స్కూల్ అసిస్టెంట్ హిందీ పోస్టుకు 19 మందికిగాను 18 మంది పరీక్షకు హాజరయ్యారు. ఈ నెల 27వ తేదీన మసూదియా అరబిక్ ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో ఖాళీగా ఉన్న పీఈటీ, గణితం స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు, ఎం.హెచ్ అప్పా హైస్కూల్‌లో ఖాళీగా ఉన్న స్కూల్ అసిస్టెంట్ తెలుగు, స్కూల్ అసిస్టెంట్ హిందీ పోస్టులకు పరీక్ష నిర్వహించనున్నారు.
దక్షిణ కొరియా సదస్సులో కర్నూలు వైద్యుడు
కర్నూలు(హాస్పిటల్): దక్షిణ కొరియాలో జరిగిన అంతర్జాతీయ యురాలజీ సదస్సులో కర్నూలుకు చెందిన యూరాలజిస్టు డాక్టర్ సేపూరి బాల రవితేజ పాల్గొన్నారు. ఈయన కర్నూలు మెడికల్ కాలేజిలోని యురాలజి విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఈ నెల 23, 24వ తేదీల్లో అక్కడ నిర్వహించిన ఆ సదస్సులో ఆయన ప్రొస్టేట్ క్యాన్సర్‌గా గెస్ట్ ఫ్యాకల్టీగా వెళ్లి ప్రసంగించారు. ప్రతిష్టాత్మక వేదికపై భారత దేశం తరఫున ప్రాతినిధ్యం వహించిన ఏకై క ఫ్యాకల్టీగా తాను ఉండటం గర్వంగా ఉందని ఆయన ‘సాక్షి’తో తెలిపారు. ఇది మన దేశ వైద్యరంగానికి దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. అక్కడి అంతర్జాతీయ వైద్యనిపుణులు, తోటి యురాలజిస్టులతో క్లినికల్ అంశాలపై తాను చర్చించి, తన అనుభవాలు పంచుకోవడం సంతోషాన్నిచ్చిందని ఆయన పేర్కొన్నారు.


