వైద్యం వికటించి శిశువు మృతి!
నందికొట్కూరు: పట్టణంలోని ఓ వైద్యశాలలో వైద్యం వికటించి ఆరునెలల శిశువు మృతి చెందాడు. మంగళవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని కుమ్మరి పేటకు చెందిన షాకీర్‌బాషా, అజిదాబాను దంపతుల కుమారుడు అబ్దుల్ రహిమాన్ దగ్గు, జలుబుతో బాధపడుతున్నాడు. చికిత్స నిమిత్తం బాలుడిని తల్లిదండ్రులు స్థానిక అనసూయ హాస్పటల్‌కు తీసుకెళ్లారు. మూడు రోజుల నుంచి డాక్టర్ శ్రీనివాసులు వైద్యం అందిస్తున్నారు. మంగళవారం రాత్రి ఉన్నట్టుండి ఆ బాలుడు మృతి చెందాడు. వైద్యం వికటించడం వల్లే తమ కుమారుడు మృతి చెందాడని ఆరోపిస్తూ తల్లిదండ్రులు, బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. టౌన్ సీఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి జోక్యం చేసుకొని విచారించి డాక్టర్‌ను అరెస్టు చేస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.


