కేసీ ఆయకట్టు.. కన్నీటి తడులు!
● ఆందోళనలో మొక్కజొన్న,
మినుము, కంది రైతులు
పగిడ్యాల: కేసీ కాలువ ఆయకట్టు కింద రబీ సీజన్‌లో రెండవ పంట సాగు చేసిన రైతుల్లో ఆందోళన మొదలైంది. కేసీ కాలువకు నీటి సరఫరా నిలిచిపోవడంతో దాదాపు వారం రోజులుగా పొలాలకు నీటి తడులు కట్టుకోలేకపోతున్నారు. ప్రస్తుతం మొక్కజొన్న పైర్లు తురాయి దశలో ఉండగా మినుము, కంది, వేరుశనగ పైర్లు పూత పడుతున్నాయి. కేసీ కాలువ పూర్తిగా ఒట్టిపోవడంతో స్లూయిస్‌లకు నీరందడం లేదు. తురాయి దశలోని మొక్కజొన్న పైర్లకు నీరు కట్టకపోతే పంట చేతికందని పరిస్థితి నెలకొంది. మండలంలోని నెహ్రూనగర్, పీకే ప్రాగటూరు, పాత, కొత్త ముచ్చుమర్రి, కొత్త ఎల్లాల, బీరవోలు, సంకిరేణిపల్లె, ఆంజనేయనగర్, పగిడ్యాల, కొత్త పాలమర్రి, లక్ష్మాపురం, తూర్పు, పడమర ప్రాతకోట, రైతుపల్లె, ఎం,ఎన్. ఘణపురం, తూర్పు, పడమర వనుములపాడు గ్రామాల రైతులు ఆందోళన చెందుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో కేసీ కాలువకు రెండు పంటలకు సమృద్ధిగా ఏప్రిల్ చివరి వరకు సాగు నీరు సరఫరా చేశారని గర్తుకు తెచ్చుకుంటున్నారు. రబీ సీజన్‌లో సాగైన పంటలు చేతికి రావాలంటే ఏప్రిల్ మొదటి వారం వరకు కేసీ కాలువకు నీటి సరఫరాను కొనసాగించాలని రైతాంగం కోరుతున్నారు. మల్యాల ఎత్తిపోతల, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాల నుంచి లిఫ్ట్ ద్వారా కేసీకి విడుదల చేయాల్సిన నీటిని సరఫరా చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు. ఈ విషయమై కేసీ కెనాల్ నీటిపారుదల శాఖ నంది కొట్కూరు సెక్షన్ ఏఈఈ వీరమ్మ వివరణ కోరగా.. తుంగభద్ర డ్యాం మరమ్మతులు ఉన్నందున 0 నుంచి 120 కి.మీ. వరకు పంటలు సాగు చేయరాదని కలెక్టర్ ఆదేశాలు ఉన్నాయన్నారు. నీటి విడుదల విషయమై విజయవాడలో నిర్వహించిన సమావేశానికి ఈఈ, డీఈలు వెళ్లారని ఆమె పేర్కొన్నారు.
కేసీ ఆయకట్టు.. కన్నీటి తడులు!


