తొలిదశలో ప్రయివేట్‌కు ఐదు టూరిజం హోటళ్లు
ప్రయివేట్‌కు ఇస్తున్న హరిత హోటళ్లు.. వాటిల్లో ఉన్న గదులు
టూరిజం హోటళ్లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్
ఉద్యోగుల వివరాలు
కర్నూలు వెంకటరమణ
కాలనీలోని హరిత హోటల్
కర్నూలు(అగ్రికల్చర్): ప్రయివేట్‌పై చంద్రబాబు ప్రభుత్వం అవాజ్యమైన ప్రేమ చూపుతోంది. ఇప్పటికే మెడికల్ కాలేజీలు, పోర్టులను పీపీపీ పేరుతో అప్పగించింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ హోటళ్లను ప్రయివేట్‌కు అప్పగిస్తోంది. పీపీపీ పేరుతో విలువైన భూములు ప్రయివేట్ అప్పగిస్తూ త్రీస్టార్ హోటళ్లను నిర్మిస్తోంది. ప్రయివేట్‌పై విపరీతమైన ప్రేమ చూపుతూ వందలాది మంది ఉద్యోగుల భవిష్యత్తును చంద్రబాబు సర్కార్ ఫణంగా పెడుతోంది.
ఉద్యోగుల భవితవ్యం ప్రశ్నార్థకం
పర్యాటకం ప్రయివేట్ పరం అయితే తమ భవితవ్యం ఏమిటని ఉద్యోగుల ఆందోళన అంతా, ఇంతా కాదు. పర్యాటక అభివృద్ధి సంస్థ కర్నూలు డివిజన్‌లో 200 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇందులో రెగ్యులర్ ఉద్యోగులు కేవలం ఐదుగురు మాత్రమే ఉన్నారు. మిగిలిన 195 మంది కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, కన్సల్టెంట్లు, సెక్యూరిటీ, డైలీ వేతనంతో పనిచేస్తున్నారు. రెగ్యులర్ ఉద్యోగుల భద్రతకు ఎలాంటి సమస్య లేకపోయినప్పటికీ మిగిలిన ఉద్యోగుల భవితవ్యం ప్రశ్నార్థకం అవుతోంది. 2024 ఎన్నికల సమయంలో ఉద్యోగులకు చంద్రబాబు ఇచ్చిన హామీలు అన్ని, ఇన్నీ కావు. చంద్రబాబు మాటలు నమ్మిన ఉద్యోగులు చంద్రబాబును గెలిపించారు. నమ్మితే నేడు మా ఉద్యోగాలకే ఎసరు పెట్టారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రయివేట్ ఆధ్వర్యంలో త్రీస్టార్ హోటళ్లు
ఒకవైపు హరిత హోటళ్లను ప్రయివేట్ పరం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం.. మరోవైపు పీపీపీ పేరుతో త్రీస్టార్ హోటళ్లను కూడా నిర్మిస్తోంది. రూ.కోట్ల విలువైన భూములను ప్రయివేట్‌కు అప్పగిస్తుండటం గమనార్హం. మంత్రాలయంలో పీపీపీ పద్ధతిలో 1.69 ఎకరాల్లో రూ.96.69 కోట్లతో త్రీస్టార్ హోటల్ నిర్మిస్తోంది. ఇందులో 240 గదులు ఉంటాయి. శ్రీ వెంకటేశ్వర లాడ్జి పేరుతో పీపీపీ పరం చేస్తోంది. నిర్మాణపు పనులు కూడా చురుగ్గా జరుగుతున్నాయి. మరోవైపు శ్రీశైలం దేవస్థానంలో పీపీపీ పద్ధతిలోనే త్రీస్టార్ హోటల్ నిర్మిస్తోంది. ఇందుకోసం రూ.కోట్ల విలువైన 2.10 ఎకరాల భూమిని ప్రయివేట్‌కు అప్పగించింది. శ్రీశైలంలో హిల్టర్–గార్డెన్ ఇన్ పేరుతో త్రీస్టార్ హోటల్‌ను రూ.83 కోట్లతో నిర్మించనున్నారు. త్వరలో నిర్మాణపు పనులు మొదలు కానున్నాయి. పర్యాటక ప్రాంతాల్లో ప్రభుత్వం ఆధ్వర్యంలో యాత్రికుల సదుపాయం కోసం స్టార్ హోటళ్లు నిర్మిస్తే తక్కువ ఖర్చుతో మెరుగైన సేవలు అందే అవకాశం ఉంది. ప్రయివేట్‌కు ఇవ్వడంతో పర్యాటకుల దోపిడీ తథ్యమనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. త్రీస్టార్ హోటళ్ల నిర్మాణంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెబుతున్నప్పటికీ ఇవన్నీ టీడీపీ కార్యకర్తలకే లభిస్తాయనే విమర్శలు ఉన్నాయి.
కొండెక్కిన పర్యాటక ప్రాంతాల అభివృద్ధి
చంద్రబాబు నేతృత్వం ప్రభుత్వం ఏర్పాటై 21 నెలలు అవుతుంది. ఈ సమయంలో పీపీపీ పద్ధతిలో త్రీస్టార్ హోటళ్లు మినహా.. ఇతర పర్యాటక ప్రాంతాల అభివృద్ధిని పట్టించుకునే దిక్కులేకుండా పోయింది. ఉమ్మడి జిల్లాలో చారిత్రక (హెరిటేజ్) టూరిజం కింద కర్నూలులోని కొండారెడ్డిబురుజు, గోల్‌గుమ్మజ్, పురావస్తుశాఖ మ్యూజియం, తగ్గలి మండలంలోని ఆశోకుని శిలాశాసనాలు, ఓర్వకల్లు మండలంలోని కేతవరంలోని రాతి చిత్రాలు ఉన్నాయి. ఏకో టూరిజం కింద ఆత్మకూరు ప్రాంతంలోని బైర్లూటి అటవీ ప్రాంతం, మిడుతూరు మండలంలోని బట్టమేక పక్షి కేంద్రం, లీజర్ టూరిజం కింద బెలుం గుహలు, రాక్‌గార్డెన్స్, వాల్మీకి గుహలు ఉన్నాయి. టెంపుల్ టూరిజం కింద శ్రీశైలం, మహానంది, అహోబిలం, ఉరుకుంద, యాగంటి, మంత్రాలయం, జగన్నాథగట్టు, మద్దిలేటిస్వామి దేవస్థానం, నందవరం చౌడేశ్వరి క్షేత్రం ఉన్నాయి. పర్యాటక రంగానికి జిల్లా పెట్టింది పేరు. మొత్తంగా 42 ప్రాంతాలకు పర్యాటక ప్రాంతాలుగా గుర్తుంపు ఉంది. అయినప్పటికీ చంద్రబాబు సర్కార్ పర్యాటక ప్రాంతాల అభివృద్ధిని మాత్రం పట్టించుకున్న దాఖలాలు లేవు. ఉమ్మడి జిల్లాకు 2023–24లో రూ. 1.25 కోట్ల పర్యాటకులు రావడం జరిగింది. 2024–25, 2025–26లో జిల్లాకు వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. పర్యాటక అభివృద్ధి సంస్థకు ఆదాయం కూడా పడిపోయింది.
రాష్ట్రంలోని 22 హరిత హోటళ్లను ప్రయివేట్‌కు ఇచ్చేందుకు జీవో వచ్చింది. ఇందులో 4వ క్లస్టర్‌లో ఆరు హరిత హోటళ్లు ఉండగా.. ఉమ్మడి జిల్లాలో ఐదు ఉన్నాయి. హరిత హోటళ్లను ప్రయివేట్‌కు ఇవ్వడంతో కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్, ఉద్యోగులు, సెక్యూరీటి సిబ్బంది తదితరులకు ఎలాంటి ఆందోళన అవసరం లేదు. పర్యాటక అభివృద్ధి సంస్థకు చెందిన ఇతర యూనిట్లతో వీరి సేవలను ఉపయోగించుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మంత్రాలయం, శ్రీశైలంల్లో పీపీపీ పద్ధతి కింద త్రీస్టార్ హోటళ్లు నిర్మిస్తోంది.
– లక్ష్మీనారాయణ, డివిజినల్ మేనేజర్,
రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ, కర్నూలు
ప్రదేశం గదులు
కర్నూలు వెంకటరమణ కాలనీ 28
ఓర్వకల్లు రాక్‌గార్డెన్ 20
మహానంది 28
ఆహోబిలం 38
శ్రీశైలం హరిత రిసార్ట్ 100
రెగ్యులర్ ఉద్యోగులు 05
కాంట్రాక్ట్ 88
డిప్యుటేషన్ 01
ఔట్ సోర్సింగ్ 63
కన్సల్టెంట్లు 03
సెక్యూరిటీలు 22
డైలీ వేతనం 18
మొత్తం 200
కనిపించని పర్యాటకం
చంద్రబాబు ప్రభుత్వంలో పర్యాటక రంగం అభివృద్ధి చెందలేదు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యాటకుల సంఖ్య గణనీయంగా పడిపోతోంది. మొదటి దశలో ప్రయివేట్ టూరిజం హోటళ్లు అప్పగిస్తున్న ప్రభుత్వం రానున్న రోజుల్లో మరిన్ని పర్యాటక ప్రాంతాలను ప్రయివేట్ పరం చేసే దిశగా కదులుతోంది. మరో మూడేళ్లలో టూరిజం మొత్తం ప్రయవేటు చేతుత్లోకి వెళ్లే ప్రమాదం ఉందని ఉద్యోగుల్లో గుబులు పడుతోంది. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసి దేశ విదేశాల నుంచి పర్యాటకులను ఆకర్షించాల్సిన అవసరం ఉండగా.. ప్రయవేటుకు పెద్దపీట దోచుకునేందుకు అవకాశం ఇస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దేవస్థానాలు, ప్రముఖ నగరాల్లో టూరిజం ఆధ్వర్యంలోని హరిత హోటళ్లు పర్యాటకులకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఇతర ప్రయివేట్ లాడ్జీలతో పోలిస్తే టూరిజం హోటళ్లలో గదులు తక్కువ ధరకు లభిస్తాయి. వీటికి పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటోంది. ఉమ్మడి జిల్లాలో ఐదు హరిత హోటళ్లను ప్రయివేట్‌కు ఇచ్చేందుకు 2025 ఆగస్టు 7న జీవో ఎంఎస్ నంబరు 23 జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాలో కర్నూలు వెంకటరమణ కాలనీలోని హరిత హోటల్, ఓర్వకల్లు రాక్ గార్డెన్, మహానంది, అహోబిలంలలోని హరిత హోటళ్లు, శ్రీశైలంల్లోని హరిత రిసార్ట్‌ను ప్రయివేట్‌కు ఇచ్చేందుకు ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ ప్రయివేట్‌కు అప్పగించేందుకు నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. వీటిల్లో 222 ఏసీ, నాన్ ఏసీ, లగ్జరీ గదులు ఉన్నాయి. ప్రయివేట్ సంస్థలు కొన్ని ముందుకు వచ్చినప్పటికీ సాంకేతిక కారణాలతో ముందుకు సాగడం లేదు. మరో రెండు, మూడు నెలల్లో టూరిజం ఆధ్వర్యంలోని హరిత హోటళ్లు ప్రయివేట్ చేతుల్లోకి వెళ్లనున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ హోటళ్లు ప్రయివేట్ చేతుత్లోకి వెళితే సేవల పేరుతో యాత్రికుల నిలువు దోపిడీ తప్పదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
తొలిదశలో ఐదు హరిత హోటళ్లు
జీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
నోటీఫికేషన్ జారీ చేసిన
ఏపీఎస్ పర్యటక అభివృద్ధి సంస్థ
మూడు నెలల్లో ప్రయివేట్ చేతుల్లోకి
టూరిజం హోటళ్లు
మంత్రాలయం, శ్రీశైలంలో పీపీపీ
పద్ధతిలో త్రీస్టార్ హోటళ్లు
మంత్రాలయంలో కోట్ల విలువైన
1.69 ఎకరాలు
శ్రీశైలంలో 2.10 ఎకరాలు
ప్రయివేట్ చేతికి
21 నెలల్లో పీపీపీ మినహా
అభివృద్ధి శూన్యం
ఉమ్మడి జిల్లాకు తగ్గిన
పర్యాటకుల తాకిడి
తొలిదశలో ప్రయివేట్‌కు ఐదు టూరిజం హోటళ్లు


