యువకుడి ఆత్మహత్య
బొమ్మలసత్రం: నంద్యాల మండలం ఊడుమాల్పురం గ్రామానికి చెందిన సురేంద్రరెడ్డి (23) శుక్రవారం రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఊడుమాల్పురం గ్రామానికి చెందిన సురేంద్రరెడ్డి పట్టణంలో ర్యాపిడో బైక్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. సురేంద్రరెడ్డికి ఇద్దరు సోదరులు, తల్లిదండ్రులు ఉన్నారు. ఉదయం పని నిమిత్తం పట్టణానికి వచ్చిన సురేంద్రరెడ్డి నూనెపల్లి సమీపంలోని రైల్వే ట్రాక్ వద్దకు వచ్చి గుర్తుతెలియని రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం వద్ద ఉన్న సెల్‌ఫోన్ నుంచి కుటుంబ సభ్యులకు ఫోన్‌చేసి సమాచారం అందించారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉందని, మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.
శ్రీశైలం నుంచి 11,676 క్యూసెక్కుల తరలింపు
శ్రీశైలం ప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయం నుంచి దిగువ ప్రాజెక్ట్‌లకు గురువారం నుంచి శుక్రవారం వరకు 11,676 క్యూసెక్కుల నీటిని తరలించారు. ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 2.490 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి నాగార్జునసాగర్‌కు 4,933 క్యూసెక్కుల నీటిని వదిలారు. బ్యాక్ వాటర్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా 2వేల క్యూసెక్కులు, హంద్రీనీవా సుజలస్రవంతికి 2,343 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 2,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
కర్నూలు: కర్నూలు శివారులోని 44వ జాతీయ రహదారి పక్కన శరీన్ నగర్ వైపు నుంచి వచ్చే సర్వీసు రోడ్డులో రెండు బైకులు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరు తీవ్ర గాయాలకు గురై ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం కొత్తపేట గ్రామానికి చెందిన షేక్ హుసేన్ బాషా (41) శరీన్ నగర్‌లో నివాసముంటూ అదే కాలనీలోని వైఎస్సార్ విగ్రహం వద్ద గోబీ బండి నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం స్నేహితుడు అబ్దుల్లాతో కలసి పల్సర్ వాహనంపై సూర్య దేవాలయం వైపు నుంచి గుత్తి పెట్రోల్ బంకులో పెట్రోల్ పోయించుకునేందుకు వెళ్తుండగా హోండా యాక్టివాలో మరో వ్యక్తి వేగంగా వచ్చి పల్సర్‌ను ఢీకొట్టింది. దీంతో షేక్ హుసేన్ బాషాకు నుదుటిపై బలమైన గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు పోలీస్ హెల్ప్‌లైన్ నెంబర్ 112కు ఫోన్ చేసి సమాచారమివ్వగా ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. గాయాలకు గురైన అబ్దుల్లాను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించి వైద్యచికిత్సలు చేయించారు. మృతదేహాన్ని ప్రైవేటు వాహనంలో ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీ కేంద్రానికి తరలించారు. గాయాలకు గురైన అబ్దుల్లా గౌండా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. మృతుని భార్య పర్వీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


