25న జాతీయ ఓటరు దినోత్సవం
కర్నూలు(సెంట్రల్): జనవరి 25న 16వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఓటర్ల దినోత్సవ నిర్వహణలో భాగంగా జిల్లా కలెక్టర్ అధికారులతో కలసి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ ఓటరు దినోత్సవాన్ని నా భారతదేశం–నా ఓటు అనే థీమ్‌తో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 25న సునయన ఆడిటోరియంలో జరిగే కార్యక్రమంలో సీనియర్ ఓటర్లు, కొత్త ఓటర్లను సన్మానిస్తామన్నారు. కార్యక్రమంలో డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
అంగన్‌వాడీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
కర్నూలు(సెంట్రల్): జిల్లాలోని 9 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 8 మెయిన్ అంగన్‌వాడీ కార్యకర్తలు, 2 మినీ అంగన్‌వాడీ కార్యకర్తలు, 54 అంగన్‌వాడీ ఆయా పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. అంగన్‌వాడీ కార్యకర్త పోస్టుకు పదో తరగతి, ఆయా పోస్టుకు 7వ తరగతి ఉత్తీర్ణత ఉండాలన్నారు. 2025 జూలై ఒకటో తేదీ నాటికి 21 సంవత్సరాలు నిండి 35 సంవత్సరాల్లోపు అభ్యర్థులే అర్హులన్నారు. ఆయా పోస్టుకు పెళ్లియి అదే గ్రామంలో నివాసం ఉంటున్న వాళ్లే దరఖాస్తు చేసుకోవాలన్నారు. పోస్టుల వివరాలను ఆయా ప్రాజెక్టు కార్యాలయాల్లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
పోలీస్ హెల్ప్‌లైన్ సేవలపై విస్తృత ప్రచారం
కర్నూలు: పోలీస్ హెల్ప్‌లైన్ నెంబర్లు 100, 112, 1930 తదితర సేవలపై పోలీసులు జిల్లా వ్యాప్తంగా అవగహన కార్యక్రమాలు నిర్వహించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్ల వారీగా సచివాలయ మహిళా పోలీసులతో కలసి పాఠశాలలు, కళాశాలల్లో సదస్సులు నిర్వహించి మహిళల భద్రత కోసం పోలీసు శాఖ చేపడుతున్న కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. సైబర్ నేరాలు, శక్తి యాప్, సోషల్ మీడియా ప్రభావం తదితర అంశాలపై కూడా మహిళలు, విద్యార్థులకు వివరించారు. ఎక్కడైనా సమస్యలు ఉంటే శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ హెల్ప్‌లైన్ నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించి పోలీసు శాఖకు సహకరించాలని అధికారులు సదస్సుల్లో వివరించారు.
యూత్ వింగ్ వైస్ ప్రెసిడెంట్‌గా కాటసాని శివనరసింహా రెడ్డి
కల్లూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు కాటసాని రాంభూపాల్ రెడ్డి తనయుడు కాటసాని శివనరసింహా రెడ్డిని స్టేట్ యూత్ వింగ్ వైస్ ప్రెసిడెంట్‌గా కేంద్ర పార్టీ కార్యాలయం శుక్రవారం నియమించింది.


