ప్రభుత్వాసుపత్రి వైద్యసేవలన్నీ డిజిటలైజేషన్
కర్నూలు(హాస్పిటల్): ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యసేవలన్నీ పూర్తిస్థాయిలో డిజిటలైజేషన్ చేస్తున్నట్లు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ విజయలక్ష్మి అన్నారు. వంద శాతం పేపర్‌లెస్ విధానం, పూర్తిస్థాయి రోగి ఆరోగ్యసేవల డిజిటలైజేషన్ దిశగా పనిచేస్తున్నట్లు ఆమె తెలిపారు. బుధవారం కర్నూలు మెడికల్ కాలేజీలోని న్యూ లెక్చరర్ గ్యాలరీలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులకు, నర్సింగ్ సిబ్బంది, ఫార్మసి ఆఫీసర్లకు, టెక్నికల్ సిబ్బందికి నిక్ నెక్ట్స్‌జెన్ ఈ–హాస్పిటల్స్‌పై ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. రాయలసీమ జోన్‌కు నోడల్ ఆఫీసర్‌గా వచ్చిన విజయలక్ష్మి మాట్లాడుతూ రోగులకు అందిస్తున్న అన్ని రకాల వైద్యసేవలు, సదుపాయాలు, రోగి ఆరోగ్య స్థితిగతులు పూర్తిస్థాయిలో డిజిటలైజేషన్ చేసేందుకు ఇటీవల నిర్వహించిన సమీక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నారన్నారు. ఇందులో భాగంగా 10 రోజుల్లో అన్ని టీచింగ్ ఆసుపత్రుల్లో శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేసేందుకు నిర్ణయించుకున్నామన్నారు. ఆరోగ్యసేవల కోసం వచ్చిన ప్రతి రోగికి అబా యాప్ డౌన్‌లోడ్ చేసుకునే విధంగా క్షేత్రస్థాయి సిబ్బంది బాధ్యత తీసుకోవాలన్నారు. ఓపీ సేవల వద్ద అబా యాప్ స్కానర్ పోస్టర్‌లను విరివిగా ఎక్కువ మందికి అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేశామన్నారు. ఓపీడీ, ఐపీడీ, ఐసీయూ, సర్జరీ, లే
బొరేటరి, రేడియాలజి సేవల వివరాలు విధిగా నెక్ట్స్‌జెన్ ప్లాట్‌ఫార్మ్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో కర్నూలు మెడికల్ కాలేజి ప్రిన్సిపల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ, ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు, స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ సీఎస్‌కే ప్రకాష్, ప్రాంతీయ ప్రభుత్వ కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సత్యనారాయణరెడ్డి, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ సింధు సుబ్రహ్మణ్యం, ఎన్‌ఐసీ డీడీ ఎలెన్ ప్రమోద్ పాల్గొన్నారు.
ప్రభుత్వాసుపత్రి వైద్యసేవలన్నీ డిజిటలైజేషన్


