అలంకారప్రాయంగా నిఘా నేత్రాలు....
● కర్నూలు కొత్తబస్టాండ్‌లో కడపకు వెళ్లే ఎక్స్‌ప్రెస్ బస్సు ఆగింది. నంద్యాల, ఆళ్లగడ్డ ప్రాంతాలకు వెళ్లే మహిళలు ఆ బస్సు ఎక్కేందుకు పోటీ పడ్డారు. ఇదే అదునుగా దొంగలు చేతివాటం చూపి నిమిషాల వ్యవధిలోనే ఇద్దరు వృద్ధ మహిళల బంగారు ఆభరణాలు దోచేశారు. పాణ్యం దాటాక ఆభరణాలు పోయినట్లు బాధితులు గుర్తించి కండక్టర్‌తో చెప్పారు. బస్సును ఆపి విచారించినా ఫలితం లేకపోయింది. ఈ సంఘటన జరిగి నాలుగు మాసాలు గడచినా పోలీసులు పట్టించుకోలేదు.
● కోవెలకుంట్లకు చెందిన శారద భర్తతో కలసి హైదరాబాద్ నుంచి కర్నూలుకు వచ్చి కోవెలకుంట్ల వెళ్లడానికి బస్సు ఎక్కుతుండగా ఇద్దరు బురఖా ధరించిన మహిళలు హ్యాండ్ బ్యాగ్‌లో ఉన్న 9 తులాల బంగారు నగలు కొట్టేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహారాష్ట్ర కోలా జిల్లాకు చెందిన రాజీ సుల్తానా, షేక్ రఫికా ఈ నేరానికి పాల్పడినట్లు గుర్తించి అంతర్రాష్ట్ర మహిళా దొంగలను అరెస్టు చేసి కటకటాలకు పంపారు.
ఈ రెండు సంఘటనలే కాదు.. ప్రయాణ సమయాల్లో మహిళల మెడల్లో, బ్యాగుల్లో నుంచి నేరుగా బంగారు ఆభరణాలు లాక్కెళ్తున్నారు. మరీ ముఖ్యంగా ఉచిత బస్సుల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుండటంతో చేతివాటం ప్రదర్శిస్తున్నారు.
ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడుతున్న కర్నూలు బస్టాండ్
కర్నూలు: మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాక వారి రాకపోకలు గణనీయంగా పెరిగాయి. దీనికి తగినట్లు బస్టాండ్లలో భద్రత ఏర్పాట్లు లేకపోవడం సమస్యలకు దారి తీస్తోంది. ప్రయాణికుల వలె దొంగలు రద్దీలోకి చొరబడి చేతివాటం ప్రదర్శిస్తున్నారు. బస్టాండ్లలో జరిగే చోరీల్లో కొన్ని మాత్రమే పోలీసుల వరకు వెళ్తున్నాయి. భద్రతా లోపాలను దొంగలు వారికి అనువుగా మలుచుకుని అందిన కాడికి దోచుకుపోతున్నారు. జిల్లాలో కర్నూలుతో పాటు ఆదోని, పత్తికొండ, ఆలూరు, మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు పట్టణాలతో పాటు మండల కేంద్రాల్లోని బస్టాండ్లలో ప్రయాణికుల భద్రతను గాలికి వదిలేసినట్లు కనిపిస్తోంది. ఇది దొంగలకు అవకాశంగా మారింది. బంగారాన్ని చోరీ చేయడంపైనే వారు ప్రధానంగా గురి పెడుతున్నారు. జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న పలు సంఘటనల ద్వారా ఈ విషయం అవగతమవుతోంది. ఆళ్లగడ్డకు చెందిన రిటైర్డ్ మహిళా ఉద్యోగి భర్తతో కలసి హైదరాబాద్ నుంచి కర్నూలుకు వచ్చి బస్టాండ్‌లో ఆళ్లగడ్డ బస్సు ఎక్కుతుండగా దొంగలు ఆమె బంగారు ఆభరణాలు తస్కరించారు. ఈ కేసు దర్యాప్తు కోసం నాలుగో పట్టణ పోలీసులు హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యాపారిని విచారణ పేరుతో అదుపులోకి తీసుకుని రూ.3 లక్షలు మామూళ్లు దండుకుని వదిలేశారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో నలుగురు సిబ్బంది శాఖాపరమైన చర్యలకు గురయ్యారు.
పక్కనే ఉండి చాకచక్యంగా...
చిన్న నగ చేతికి చిక్కినా రూ.లక్ష వస్తాయని ఆశ పడుతూ దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు. రద్దీ సమయంలో పక్కనే ఉంటూ బస్సు ఎక్కుతున్నట్లు నటించి చాకచక్యంగా నగలు, పర్సులు కొట్టేస్తున్నారు.
పోలీస్ ఔట్‌పోస్టు ఉన్నా
పర్యవేక్షణ నామమాత్రమే...
కర్నూలు బస్టాండ్‌లో విచిత్ర పరిస్థితి. రోజూ 70 వేలకు పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఇక్కడ పోలీసు ఔట్‌పోస్టు ఉన్నా పర్యవేక్షణ లేక చోరీలు కొనసాగుతూనే ఉన్నాయి. సెల్‌ఫోన్లు, పర్సులు, ఆభరణాలు పోగొట్టుకున్న ప్రయాణికులు కొన్ని సందర్భాల్లో ఫిర్యాదు చేయడానికి కూడా ఔట్‌పోస్టులో పోలీసులు ఉండరు. ఆర్టీసీ డిపోలో సెక్యూరిటీ సిబ్బంది సేవలు కూడా నామమాత్రమయ్యాయి.
ప్రయాణ సమయంలో వీలైనంత వరకు తక్కువ ఆభరణాలు ధరించడం, తరలించడం మంచిది. ముఖ్యంగా బస్సు ఎక్కేటప్పుడు చుట్టు పక్కల గమనిస్తూ అప్రమత్తంగా ఉండటం అవసరం. అపరిచితులు ఇచ్చే ఆహార పదార్థాలు తీసుకోవద్దు. మత్తు కలిపిన తినుబండారాలు ఇచ్చి నిద్రమత్తులోకి జారుకోగానే దొంగలు చేతివాటం ప్రదర్శించే అవకాశముంది. సీటు దొరికించుకోవాలన్న ఆత్రుతతో పక్కనున్న వారిని కూడా గమనించకపోవడం వల్ల దొంగలకు అవకాశంగా మారుతోంది. ప్రయాణికులు అజాగ్రత్త, నిర్లక్ష్యం వీడాలి.
– విక్రమసింహ, సీఐ
జిల్లా కేంద్రం కర్నూలు ఆర్టీసీ బస్టాండ్‌లో నిఘా నేత్రాలు అలంకారప్రాయంగా మారాయి. రాష్ట్రంలోనే కర్నూలు రెండో అతిపెద్ద బస్టాండ్. నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే ఈ బస్టాండ్‌లో ఈ పరిస్థితి ఉండటం ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ బస్టాండ్‌లో రెండు నెలల వ్యవధిలో ఐదు చోరీ సంఘటనలు జరగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. సెల్‌ఫోన్లు, బ్యాగుల అపహరణ సర్వసాధారణంగా మారింది. ప్రతి రోజూ ఒకటి, రెండు సంఘటనలు జరుగుతున్నా సీసీ కెమెరాల్లో స్పష్టమైన దృశ్యాలు కనిపించకపోవడంతో పోలీసులు కూడా ఏమీ చేయలేకపోతున్నారు. ఓ మహిళా ప్రయాణికురాలి సంచిలో నుంచి గుర్తు తెలియని వ్యక్తులు ఇటీవల రెండు తులాల బంగారు గొలుసు అపహరించారు. క్యాంటీన్‌లో అల్పాహారం తిని నంద్యాలకు వెళ్లే బస్సు ఎక్కి ఆధార్ కార్డు కోసం సంచి తెరవడానికి చూడగా అప్పటికే ఎవరో తెరచి అందులో బంగారు గొలుసు అపహరించినట్లు గుర్తించి లబోదిబోమన్నారు. బస్సు అప్పటికే నన్నూరు టోల్‌ప్లాజా వద్దకు చేరుకోవడంతో వెనక్కు రాలేక చేసేదేమీ లేక ఆమె వెళ్లిపోయింది.
ఆర్టీసీ బస్టాండ్లలో కొరవడిన నిఘా
మహిళలూ... ప్రయాణాల్లో
జర జాగ్రత్త!
బంగారం ధరతో పాటే
పెరుగుతున్న చోరీలు
స్వీయ రక్షణతోనే ఆభరణాలు భద్రం
అలంకారప్రాయంగా నిఘా నేత్రాలు....


