ఆన్‌లైన్ నమోదులో పొరపాట్లకు తావివ్వొద్దు
తుగ్గలి: భూ సర్వే రికార్డుల ఆన్‌లైన్ నమోదులో ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ అన్నారు. బుధవారం ఆయన తుగ్గలిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయంలో మ్యూటేషన్, సబ్ డివిజన్, రీ సర్వే పూర్తయిన గ్రామాలకు సంబంధించి భూ వివరాల ఆన్‌లైన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. సర్వేలో ఎవరికై నా అభ్యంతరాలు ఉంటే సంబంధిత రైతుల నుంచి వినతులు స్వీకరించి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. అసైన్డ్ భూముల ఆన్‌లైన్‌కు సంబంధించి రీ సర్వే డీటీ మధుమతి, వీఆర్వోలు, సర్వేయర్లకు జేసీ పలు సూచనలు చేశారు. అంతకు ముందు రైతు సేవా కేంద్రం వద్ద మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన కందుల బ్యాగ్‌ల తూకాలు, నాణ్యత, తేమ శాతం పరిశీలించారు. ఆయన వెంట ఆర్డీవో భరత్‌నాయక్, తహసీల్దార్ రవి తదితరులు ఉన్నారు.
ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పెంపు
కర్నూలు: కర్నూలు న్యాయ సేవాధికార సంస్థలో రికార్డు అసిస్టెంట్, ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ రెగ్యులర్ ఉద్యోగ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువు ఈనెల 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పొడిగించినట్లు సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఆయా ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు ఈనెల 27లోపు దరఖాస్తు చేసుకోవాలని మొదట నోటిఫికేషన్ వెలువడిందన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ ఆదేశాల మేరకు గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
పీఎం అబీం నిధులతో పంచాయతీ భవనాలు
కర్నూలు(అర్బన్): ప్రధానమంత్రి ఆయు ష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాక్ట్చర్ మిషన్ (పీఎంఏబీహెచ్‌ఐఎం) నిధులతో జిల్లాలో గ్రామ పంచాయతీ భవనాలు, విలేజ్ హెల్త్ క్లీనిక్స్ నిర్మాణాలు చేపట్టనున్నారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ఈ పనులను చేపట్టేందుకు కార్యాచరణను రూపొందించారు. ఒక గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి రూ.32 లక్షలు, విలేజ్ హెల్త్ క్లీనిక్ భవన నిర్మాణానికి రూ.42 లక్షలను వెచ్చించనున్నారు. జిల్లాకు 35 గ్రామ పంచాయతీ భవనాలు మంజూరు కాగా, 24 గ్రామాల్లో పంచాయతీ భవనాలు నిర్మించేందుకు స్థలాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే 87 హెల్త్ క్లీనిక్స్ భవనాలు మంజూరు కాగా, 63 ప్రాంతాల్లో భవనాలు నిర్మించేందుకు స్థలాలు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే 11 గ్రామ పంచాయతీ భవనాలు, 24 విలేజ్ హెల్త్ క్లీనిక్స్ భవన నిర్మాణాలకు స్థలాలు కేటాయించాలని అధికారులు జిల్లా కలెక్టర్‌ను కోరారు.


