చిన్న తరహా పరిశ్రమల ప్రోత్సాహంతో వలసల నివారణ
శ్రీశైలంప్రాజెక్ట్: చిన్న తరహా పరిశ్రమల ప్రోత్సాహంతో గ్రామీణ ప్రాంతాల్లో వలసలు నివారించవచ్చునని పలు యూనివర్సిటీల ప్రొఫెసర్లు అన్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్‌లో భారతీయ సామాజిక శాస్త్ర పరిశోధన మండలి సహకారంతో నిర్వహిస్తున్న జాతీయ సదస్సు రెండో రోజు శుక్రవారం కొనసాగింది. ‘డిజిటల్ యుగంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల పాత్ర’ అనే అంశంపై సదస్సులో పాల్గొన్న వక్తలు తమ ప్రయోగాలు, అనుభవాలు, ఆలోచనలను విశదీకరించారు. పరిశ్రమలు మనుగడ సాగించాలంటే డిజిటలైజేషన్‌ను ఉపయోగించుకొని ఒక ముడి సరుకుతో ఎన్ని రకాల ఉత్పత్తులు చేపట్టవచ్చో, ఎలా మార్కెటింగ్ చేసుకోవచ్చో తెలుసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు మారుతున్న వినియోగదారుడి అభిరుచికి అనుగుణంగా ఉత్పత్తి, డిజైన్, క్వాలిటీ, ప్యాకింగ్ చేసుకోవాలన్నారు. స్థానికంగా దొరికే ముడి సరుకుతో ఉత్పత్తులు చేసి, ఆన్‌లైన్ మార్కెటింగ్ చేసుకోవడం వలన ఎక్కువ లాభాలు ఆర్జించే అవకాశం ఉందన్నారు. యువత కొత్త తరహా ఆలోచనలతో చిన్నచిన్న స్టార్టప్‌లు ప్రారంభించి స్థానికంగా పలువురికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని సూచించారు. సదస్సులో యోగివేమన విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జి.విజయభారతి, సిటీ కాలేజీ ఆఫ్ హైదరాబాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎస్.జాన్సీరాణి, స్కూల్ ఆఫ్ బిజినెస్ స్టడీస్ కర్ణాటక సెంట్రల్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.పి.రాజలింగంగౌడ , తెలంగాణ దేవరకొండ ఎంకెఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఆర్.రవి, హైదరాబాద్ వివేకానంద డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.సంతోషి విరాళ, సదస్సు కన్వీనర్ డా.ఎం.బుచ్చయ్య, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా.పి.హుస్సేన్ బాషా, రిటైర్డ్ డిప్యూటీ డీఈఓ జి.సి.ఎల్లారెడ్డి, అఖిలభారత రెడ్ల సంక్షేమ సమాఖ్య అధ్యక్షుడు జి.తాతిరెడ్డి, ఎస్‌బీఐ మేనేజర్ బాలన్న, అధ్యాపకులు, విద్యార్ధులు పాల్గొన్నారు.


