రోడ్డు భద్రత సామాజిక బాధ్యత
● డీటీసీ శాంతకుమారి
కర్నూలు: రోడ్డు భద్రత సామాజిక బాధ్యత అని, ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని రవాణా శాఖ కర్నూలు డిప్యూటీ కమిషనర్ శాంతకుమారి అన్నారు. రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా కర్నూలు శివారులోని పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజిలో రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డీటీసీ శాంతకుమారి ముఖ్య అతిథిగా హాజరై రోడ్డు భద్రత నిబంధనలపై విద్యార్థినీ, విద్యార్థులకు అవగాహన కల్పించారు. చిన్న జాగ్రత్తలు పాటిస్తే సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చని, ప్రతి వాహనదారుడు వేగ నియంత్రణ పాటించాలని సూచించారు. 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు వారు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారన్నారు. గత ఏడాది అక్టోబర్ 24న చిన్నటేకూరు వద్ద మద్యం తాగిన బైకర్ నిర్లక్ష్యం వల్ల జరిగిన బస్సు ప్రమాదంలో 19 మంది అగ్నికి ఆహుతయ్యారని గుర్తు చేశారు. విశ్రాంతి లేకుండా డ్రైవింగ్ చేయకూడదని, రాత్రి 10 గంటల తర్వాత వీలైనంత వరకు ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిదన్నారు. ఆర్‌టీఓ భరత్ చవాన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘గుడ్ సమారిటన్ రాహ్–వీర్’ పథకం ద్వారా ప్రమాదం జరిగినప్పుడు మొదటి గంటలోగా గాయపడినవారిని ఆసుపత్రికి తీసుకెళ్తే రూ.25 వేలు నగదు ప్రోత్సాహకాన్ని ప్రభుత్వం అందిస్తుందన్నారు. వ్యక్తిగతంగా ఎలాంటి ఇబ్బంది ఉండదని, కేసులకు భయపడాల్సిన అవసరం లేదన్నారు. రోడ్డు భద్రతపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వీడియోలు ప్రదర్శించి అవగాహన కల్పించారు. అనంతరం రోడ్డు భద్ర తపై విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎంవీఐలు కె.మల్లికార్జున, ఆర్‌వీ మధుసూదన్, కె.రవీంద్ర కుమార్, ఎంవీ సుధాకర్ రెడ్డి, ఏఎంవీఐ బాబుకిషోర్, ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్, కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్లు సుస్మిత, యశ్వంత్, డీన్ డాక్టర్ కె.దేవకి, తదితరులు పాల్గొన్నారు.


