ఎస్‌ఎస్ ఫలితాల్లో కేఎంసీ విద్యార్థుల సత్తా
● 13 మంది విద్యార్థులకు ఉత్తమ ర్యాంకులు
కర్నూలు(హాస్పిటల్): సూపర్‌స్పెషాలిటీ (ఎస్‌ఎస్) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పరీక్షలో కర్నూలు మెడికల్ కాలేజి వైద్య విద్యార్థులు ర్యాంకుల పంట పండించారు. ఏకంగా 13 మంది పీజీ విద్యార్థులు ఆలిండియా ఉత్తమ ర్యాంకులు సాధించి కోర్సులో ప్రవేశం దక్కించుకోనున్నారు. దేశవ్యాప్తంగా మెడిసిన్, పీజీ పూర్తి చేసిన తర్వాత సూపర్‌స్పెషాలిటీ వైద్య కోర్సుల్లో ప్రవేశం కోసం గత డిసెంబర్ 26, 27వ తేదీల్లో నీట్–ఎస్‌ఎస్ ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. ఇందులో 12 మంది సర్జరీ పీజీ విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారు. వీరిలో డాక్టర్ డి.విష్ణు శ్రీకర్‌రెడ్డి 65, డాక్టర్ కె. సాయికళ్యాణ్ 75, డాక్టర్ కె.ఉదయ్‌కుమార్ 125, డాక్టర్ కె.వినీత్‌రెడ్డి 210, డాక్టర్ అంబటి తేజేశ్వర్‌రెడ్డి 343, డాక్టర్ ఆర్. శిరీష 378, డాక్టర్ జి.అనంత నివేష్ 668, డాక్టర్ పి. మహ్మద్ సర్ఫరాజ్ 926, డాక్టర్ పి.పవన్‌కళ్యాణ్ 936, డాక్టర్ వి. సాయిచరణ్ 1022, డాక్టర్ టి.మహేంద్రబాబు 1168, డాక్టర్ ఇ. అనిల్‌కుమార్ 1500, డాక్టర్ జి. సాయిహరీష్‌రెడ్డి 2206వ ర్యాంకులు సాధించారు. వీరిలో డాక్టర్ విష్ణుశ్రీకర్‌రెడ్డి, డాక్టర్ తేజేశ్వరరెడ్డి ప్రస్తుతం సర్జరీ విభాగంలో సీనియర్ రెసిడెంట్లుగా ఉన్నారు. మంగళవారం వీరిని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ, వైస్ ప్రిన్సిపాల్, జనరల్ సర్జరీ హెచ్‌ఓడీ డాక్టర్ హరిచరణ్, అభినందించారు. కార్యక్రమంలో సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ ఎం.కోటిరెడ్డి, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ విజయబాబు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు పాల్గొన్నారు.


