రైతుబజారును సందర్శించిన ఐఎస్‌ఓ అధికారుల బృందం
కర్నూలు(అగ్రికల్చర్): నగరంలోని సీ క్యాంపు రైతుబజారును హెచ్ వైఎం ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ప్రయివేటు లిమిటెడ్ ప్రతినిధుల బృందం సందర్శించింది. టీమ్ లీడర్ శివయ్య రైతులు, వినియోగదారులు, రైతుబజారు అధికారులతో ముఖా ముఖి మట్లాడారు. రాష్ట్రంలోని టాప్–5 రైతుబజార్లులో కర్నూలు సి.క్యాంపు ఒకటి, ఈ రైతుబజారుకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ సర్టిఫికెట్ ఇవ్వాలనే ప్రతిపాదన ఉంది. రాష్ట్ర రైతుబజార్ల ముఖ్య కార్యనిర్వహణ అధికారి మాధవిలత వినతి మేరకు హెచ్‌వైఎం ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ప్రయివేటు లిమిటెడ్ ప్రతినిధుల బృందం రైతు బజారును సందర్శించింది. పరిశుభ్రతను పరిశీలించి రైతుబజారులో రైతులకు తగిన స్థానం లభిస్తుందా... వినియోగదారులకు నాణ్యమైన కూరగాయలు లభిస్తున్నాయా.. రైతుబజారులో జరుగుతున్న కూరగాయల అమ్మకాల పట్ల రైతులు, వినియోగదారుల అభిప్రాయాలు ఎలా ఉన్నాయనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతుబజారు నిర్వహణపై మార్కెటింగ్ శాఖ ఏడీ నారాయణ మూర్తి, ఎస్టేటు అధికారి కల్యాణి, హార్టికల్చర్ కన్సల్టెంటు శివకుమార్‌ను అడిగి తెలుసుకున్నారు.


