యూరియా దుర్వినియోగంపై విచారణ
కర్నూలు (అగ్రికల్చర్): గతేడాది ఖరీఫ్ సీజన్‌లో ఆదోని సబ్ డివిజన్‌లోని కౌతాళం మండలానికి మార్క్‌ఫెడ్ ద్వారా సరఫరా అయిన యూరియా దారి మళ్లడంపై గురువారం అగ్రానమి ఏడీఏ రాజశేఖర్ విచారణ జరిపారు. విచారణకు ఆదోని ఏడీఏ బాలవర్ది రాజు, కౌతాళం మండల వ్యవసాయ అధికారి శేషాద్రి, మార్క్‌ఫెడ్ మేనేజర్ రాజు హాజరయ్యారు. గత ఏడాది ఖరీఫ్ సీజన్‌లో యూరియాకు తీవ్ర సమస్య ఏర్పడింది. మార్క్‌ఫెడ్ నుంచి కౌతాళం మండలానికి సరఫరా అయిన యూరియా కర్ణాటక రాష్ట్రానికి మళ్లించినట్లు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. యూరియా దారి మళ్లడానికి కౌతాళం ఏఓ శేషాద్రి కారణమంటూ న్యాయవాది ఒకరు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. యూరియా దుర్వినియోగంపై ఫిర్యాదుతో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఫిర్యాదును ప్రభుత్వానికి పంపడంతో విచారణకు ఆదేశించింది. విచారణ అధికారిగా అగ్రానమీ ఏడీఏ రాజశేఖర్ నియమితులయ్యారు. ఈయన ఇదివరకు కౌతాళంలో చేపట్టారు. అయితే ఫిర్యాదుదారు విచారణకు హాజరుకాలేదు. తాజాగా జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయంలో నిర్వహించిన విచారణకు కూడా గైర్హాజరయ్యారు. ఫిర్యాదుదారుతో వ్యవసాయ అధికారి అవగాహన ఏర్పరుచుకోవడం వల్లనే విచారణకు హాజరుకావడం లేదనే చర్చ జరుగుతోంది. విచారణకు ఫిర్యాదుదారు అయిన వ్యక్తి సహకరించకపోవడాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోతామని అగ్రానమీ ఏడీఏ తెలిపారు.


