‘సర్’తో మానవ హక్కుల ఉల్లంఘన
● ప్రముఖ కాలమిస్టు డాక్టర్
పరకాల ప్రభాకర్
కర్నూలు(సెంట్రల్): ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాలనలో దేశం ఫాసిజం వైపు అడుగులు వేస్తోందని, ప్రశ్నించే వారిని జైళ్లలో వేసి నోర్లు మూయిస్తున్నారని ప్రముఖ కాలమిస్టు డాక్టర్ పరకాల ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం కర్నూలులోని లలితా కళా సమితిలో పౌర చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఆ సంఘం అధ్యక్షుడు ఓంకార్ ఆధ్యక్షతన ‘మానవ హక్కుల పరిరక్షణ–మన ముందున్న సవాళ్లు’ అన్న అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ప్రధానంగా కేంద్ర ఎన్నికల సంఘం అమలు చేస్తున్న స్పెషల్ ఇన్‌సెంటివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)పై పరకాల ప్రభాకర్ కీలకోపన్యాసం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎస్‌ఐఆర్ ద్వారా దేశంలో కోట్లాది మంది పౌరుల ఓటర్లను తొలగించి వారి హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని ఆరోపించారు. దేశంలో అక్రమల చోరబాటుదారుల ను అరికట్టడానికి సర్‌ను తీసుకొస్తున్నామని ప్రభుత్వం చెబుతోందని, అయితే ఇంత వర కు ఎంతమంది వలసదారులను గుర్తించిందో మాత్రం చెప్పడంలేదన్నారు. కానీ సర్ పేరు తో బిహార్, పశ్చిమ బెంగాల్, తమిళనాడుల్లో కోట్లాది ఓట్లను తొలగించారని ఆరోపించారు. ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా ప్రజలంతా రోడ్లపైకి వచ్చి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఉపన్యాసకులుగా హాజరైన సీపీడీఆర్‌ఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ కుంచే శ్రీధర్ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల సమస్యలను పక్కదాని పట్టించడమే కాక వారి మధ్య వైషమ్యాలు, మత విద్వేషాలు రెచ్చగొడుతోందన్నారు. ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ ద్వారా ముస్లిం మైనార్టీ ఓటర్లను తొలగించేందుకే బీజేపీ సర్‌ను తెచ్చిందని ఆరోపించారు. అనంతరం కర్నూలు జిల్లా కార్యదర్శి ఎం.తేజోవతి, జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు వి.బ్రహ్మారెడ్డి, సీపీడీఆర్‌ఎస్ తెలంగాణ ఇన్‌చార్జ్ ఎస్ జానీ బాషా ప్రసంగించారు. కార్యక్రమంలో న్యాయవాదులు రాము, చంద్రుడు, రమేష్, గోవిందరాజు, హనీఫ్, జహీర్, ప్రియాంక పాల్గొన్నారు.


