కర్నూలు(అర్బన్): జిల్లా పరిషత్ సీఈఓగా జీవీ రమణారెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ సీఈఓగా విధులు నిర్వహించిన జి.నాసరరెడ్డిని అనంతపురం డీఎస్‌జీఎస్‌డబ్ల్యూఓగా నియమించారు. ఈ నేపథ్యంలో కర్నూలు డీడీఓగా విధులు నిర్వహిస్తున్న రమణారెడ్డిని సీఈఓగా నియమిస్తూ పీఆర్‌అండ్‌ఆర్‌డీ ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ శశిభూషణ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. నూతన సీఈఓని డిప్యూటీ సీఈఓ ఈవీ సుబ్బారెడ్డి, డీపీఆర్‌సీ కోఆర్డినేటర్ మంజులవాణి, కర్నూలు డీఎల్‌పీఓ టి.లక్ష్మి, జెడ్పీ పరిపాలనాధికారులు, కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జెడ్పీ ఉద్యోగులు విధులను సక్రమంగా నిర్వహించాలన్నారు. నివేదికలను సకాలంలో ఉన్నతాధికారులకు చేరవేయాలన్నారు. ప్రస్తుత వేసవిలో ఎక్కడా తాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు.
ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలకు ప్రథమ స్థానం
కర్నూలు(అర్బన్): ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు నిర్వహించడంలో రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025 ఏప్రిల్ నుంచి 2026 ఫిబ్రవరి వరకు 5,500 ప్రసవాలు లక్ష్యం కాగా 7,982 ప్రసవాలను నిర్వహించారన్నారు. ఇందులో సాధారణ ప్రసవాలు 5,881 కాగా, సిజేరియన్ 2,101 కాన్పులు ఉన్నాయన్నారు. 30 శాతానికి మించి సిజేరియన్ కాన్పులు జరగకూడదని, జిల్లాలో 26 శాతం మాత్రమే సిజేరియన్ కాన్పులు చేసి, సాధారణ ప్రసవాలకు పెద్దపీట వేశారన్నారు. ఎంసీహెచ్ ఆదోని, ఎమ్మిగనూరు ఏరియా హాస్పిటల్, పత్తికొండ, ఆలూరు, కోడుమూరు, వెల్దుర్తి, ఓర్వకల్ సీహెచ్‌సీల్లో ఈ ప్రసవాలు జరిగాయని కలెక్టర్ వివరించారు.
రానున్న రెండు రోజుల్లో వడగాడ్పులు
కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో రానున్న రెండు రోజుల్లో వడగాడ్పులు, ఎండల తీవ్రత పెరిగే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. శుక్ర, శనివారాల్లో కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 42 నుంచి 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ విభాగం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ సురేష్‌కుమార్ తెలిపారు. గురువారం కౌతాళంలో 39.4, పెద్దకడుబూరు, రుద్రవరంలలో 39.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
దరఖాస్తు గడువు పొడిగింపు
ఎమ్మిగనూరుసెంట్రల్: బనవాసి ఏపీ బాలికల గురుకుల కళాశాలలో ఇంటర్మీడియెట్ ప్రవేశానికి దరఖాస్తు గడువును ఈనెల 7వ తేదీ వరకు పెంచినట్లు కళాశాల ప్రిన్సిపాల్ రజిత తెలిపారు. ఆమె మాట్లాడుతూ ఎంపీసీలో 60 సీట్లు, బైపీసీలో 40 సీట్లు, ఎంఈసీలో 30 సీట్లు ఖాళీగా ఉన్నాయని, కళాశాల వైబ్‌సెట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ముగిసిన పది పరీక్షలు
కర్నూలు సిటీ: పదవ తరగతి పరీక్షలు గత నెల 16న మొదలై గురువారంతో ముగిశాయి. జిల్లాలో 160 కేంద్రాల్లో పరీక్షలను పకడ్బందీగా నిర్వహించారు. చివరి పరీక్షకు 34,301 మంది విద్యార్థుల్లో 33,792 మంది హాజరయ్యారు. పరీక్షలు ముగియడంతో విద్యార్థులు కేంద్రాల వద్ద కేరింతలు కొడుతూ స్నేహితులకు వీడ్కోలు పలికారు. హాస్టళ్లలో చదువుకుంటున్న విద్యార్థులు లగేజీలతో సొంత ఊళ్లకు పయనమయ్యారు. పరీక్షలు ముగియడంతో మూల్యాంకనానికి పరీక్షల విభాగం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 6 నుంచి 15వ తేది వరకు నిర్వహిస్తున్న మూల్యాంకనానికి క్యాంపు ఆఫీసర్‌గా డీఈఓ ఎల్.సుధాకర్ వ్యవహారించనున్నారు. ఇందుకు కావాల్సిన 738 సిబ్బందిని నియమించి, ఆర్డర్లు సైతం ఇచ్చారు. జిల్లాకు ఇప్పటి వరకు 1,03,809 లక్షల వరకు స్క్రీప్ట్‌లు వచ్చాయి.
శ్రీశైలంలో మద్యం పట్టివేత
శ్రీశైలం: దేవస్థానం పరిధిలోని దాసరిసత్రం సమీపంలో గురువారం మద్యం విక్రయిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకొని వారి నుంచి 120 మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం విక్రయిస్తున్న ఆత్మకూర్ మండలం సిద్ధాపురం గ్రామానికి చెందిన ఇరగ దిండ్ల రమాక్షి, దుండుగల చంద్రమ్మపై కేసు నమోదు చేసుకొని రిమాండ్ నిమిత్తం ఆత్మకూర్ కోర్టుకు తరలించినట్లు ఎస్‌ఐ సుబ్బారెడ్డి తెలిపారు.


