శిరివెళ్ల: ఆళ్లగడ్డ– నంద్యాల జాతీయ రహదారిపై గోవిందపల్లె సమీపంలో ఆర్టీసీ బస్సు ఢీకొని గుండంపాడుకు చెందిన గాలి ప్రవీణ్‌కుమార్ (25) మృతి చెందాడు. ఘటనపై ఎస్‌ఐ మధుసూదన్ తెలిపిన వివరాలు.. ప్రవీణ్‌కుమార్ నంద్యాలలో ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. అతనికి యర్రగుంట్లకు చెందిన అనుష్కతో గతేడాది వివాహమయ్యింది. ఆమె గర్భిణి కావడంతో పుట్టింట్లో ఉన్న భార్యను చూసేందుకు ఈ నెల 1వ తేదీన రాత్రి ప్రవీణ్‌కుమార్ నంద్యాల నుంచి బైక్‌పై బయలుదేరాడు. నంద్యాల డిపోకు చెందిన బస్సు మరమ్మతులు చేయించుకొని సర్వీస్ రోడ్డుపై నుంచి జాతీయ రహదారిపైకి వెళ్లే క్రమంలో బైక్‌పై వస్తున్న యువకుడిని ఢీకొట్టింది. ప్రమాదంలో ప్రవీణ్‌కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి జోజప్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
9న రైతు సంబరాలు
శిరివెళ్ల: కాలేషా మస్తాన్ వలి ఉరుసు సందర్భంగా దాతల సహకారంతో ఈ నెల 9వ తేదీన యర్రగుంట్లలో రాష్ట్రస్థాయి రైతు సంబరాలు (ఎద్దుల పందేలు) నిర్వహించనున్నట్లు దర్గా నిర్వాహకుడు శంకర్ గురువారం తెలిపారు. ఒంగోలు జాతి సీనియర్ విభాగంలో రాతి దూళం లాగే పందెంలో గెలుపొందిన వృషభ రాజముల యజమానులకు మొదటి బహుమతి రూ.70 వేలు తరువాతి స్థానాలకు వరుసగా రూ.60 వేలు, రూ.50 వేలు, రూ.40 వేలు, రూ.35 వేలు, రూ.30 వేలు, రూ.25 వేలు, రూ.20 వేలు, రూ.10 వేలు, రూ.5 వేలను అందించనున్నట్లు వెల్లడించారు. అలాగే 8వ తేదీన గాడిదల పందేలు జరుగుతాయన్నారు. గెలుపొందిన గాడిదల యజమానులకు మొదటి బహుమతి రూ.10 వేలు, తరువాతి స్థానాలకు రూ.6 వేలు, రూ.3 వేలు అందించనున్నట్లు వెల్లడించారు.
వెల్దుర్తి: స్థానిక రాణితోటకు చెందిన ఎరుకల జయంత్ (9) కర్నూలు ఆసుపత్రిలో కడుపునొప్పితో చికిత్స పొందుతూ కొలుకోలేక గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు. గౌండ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్న రమేశ్, రాజేశ్వరి దంపతులకు ఇద్దరు కుమారులు,కుమార్తె సంతానం. పెద్ద కుమారుడు జయంత్ స్థానిక శర్మాస్ యూపీ స్కూల్‌లో రెండో తరగతి చదువుతున్నాడు. గత నెల 31న జ్వరం, వాంతులతో స్థానిక సీహెచ్‌సీలో చేరాడు. ఈ నెల 1న కడుపునొప్పి, ముఖం వాపు తీవ్రం కావడంతో వైద్యులు కర్నూలుకు రెఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక మృత్యువాత పడ్డాడు. దీంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
బస్సు దిగుతూ మృత్యువాత
దొర్నిపాడు: ఆళ్లగడ్డ ఆర్టీసీ బస్టాండులో బస్సు దిగుతూ దొర్నిపాడుకు చెందిన సాలయ్య (60) అనే వ్యక్తి గురువారం మృతి చెందాడు. ఆయన ఒంటిమిట్టలో స్వామివారి దర్శనం అనంతరం తిరుగు ప్రయాణం అయ్యారు. అలసట, కళ్లు తిరగడం వంటి లక్షణాలతో ఆళ్లగడ్డ చేరుకున్నారు. బస్టాండులో బస్సు దిగుతూ కిందపడిపోయాడు. అక్కడున్న వారు 108 వాహనంలో స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
వైద్యుడికి చార్జ్ మెమో
చాగలమర్రి: మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యుడిగా పనిచేస్తున్న డాక్టర్ ఇమ్రాన్‌కు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి చార్జి మెమో జారీ అయినట్లు వైద్యాధికారిణి అంజలి తెలిపారు. హాస్పిటల్ డెవలప్‌మెంట్ సొసైటీ, ఆరోగ్యశ్రీ, జేఎస్‌ఎస్‌కే తదితర పథకాల నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. నిధుల వినియోగంలో నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు తోటి వైద్యులు, సిబ్బందితో పాలనాపరమైన సమన్వయం పాటించడంలో విఫలమయ్యారని అభి యోగాలు నమోదయ్యాయి. దీనివల్ల పీహెచ్‌సీ పనితీరుకు ఆటంకం కలిగిందని మెమోలో పేర్కొన్నారు. మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని, లేనిపక్షంలో శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆదేశించినట్లు డాక్టర్ అంజలి వివరించారు.
క్రీస్తు ప్రేమను
ప్రపంచమంతా చాటాలి
కర్నూలు (టౌన్): క్రీస్తు ప్రేమను ప్రపంచవ్యాప్తంగా చాటాలని కర్నూలు డయాసిస్ బిషప్ గోరంట్ల జ్వాన్నేష్ పిలుపునిచ్చారు. పవిత్ర గురువారం పురస్కరించుకొని స్థానిక నంద్యాల చెక్‌పోస్టులోని లూర్థుమాత కథిడ్రల్ బిషప్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన దైవసందేశమిస్తూ క్రీస్తును ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలన్నారు. ఆనాడు క్రీస్తును శిలువలో కొట్టే ముందు శిష్యుల పాదాలు కడిగి సోదరభావాన్ని చాటారన్నారు. గుడ్‌ఫ్రైడే సందర్భంగా శుక్రవారం చిల్డ్రన్స్ పార్కు వద్ద ఉన్న థెరిసమ్మ చర్చి నుంచి నంద్యాల చెక్‌పోస్టు బిషప్ చర్చి మీదుగా ప్రేమగిరికి భక్తిశ్రద్ధలతో శిలువ యాత్ర నిర్వహిస్తున్నామని, ప్రతిఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.


