కర్నూలు(అర్బన్): జిల్లాలో పొట్టేళ్లు, మేకలు, గొర్రెల సంఖ్యను ప్రామాణికంగా తీసుకొని ఐదు ప్రాంతాల్లో పశు జనరిక్ మందుల దుకాణాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. గురు వారం మధ్యాహ్నం కలెక్టర్ చాంబర్‌లో పశు సంవర్ధక శాఖకు చెందిన షీప్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జనరిక్ మందుల అవుట్‌లెట్ల ఏర్పాటుపై కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. కర్నూలు, ఆదోని, పత్తికొండ, కోడుమూరు, హోళగుంద ప్రాంతాల్లో ప్రభుత్వ పశు వైద్యశాల భవనాలు, లేదా ప్రభుత్వ స్థలాల్లో జనరిక్ మందుల షాపులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని జేడీ హేమంత్‌కుమార్‌ను ఆదేశించారు. నిబంధనల మేరకు భవనాలకు రెంట్ ప్రపోజల్స్, రెవెన్యూ అధికారుల సహకారంతో ఆయా స్థలాల లీజ్ ప్రపోజల్స్ ఇవ్వాలని ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈని ఆదేశించారు. జేడీ మాట్లాడుతూ.. ఒక దుకాణం యూనిట్ ధర రూ.3.61 లక్షలుగా నిర్ణయించినట్లు చెప్పారు. నాలుగు దుకాణాల ఏర్పాటుకు సంఘాలు ముందుకు వచ్చాయిని, హోళగుందలో ఎస్‌హెచ్‌జీ ద్వారా దుకాణం ఏర్పాటు చేసేందుకు రూ.1.50 లక్షలను కేంద్రం సబ్సిడీ ఇస్తుందన్నారు. మిగిలిన నాలుగు దుకాణాలకు ఏపీ షీప్ ఫెడరేషన్ రూ.1.50 లక్షల సబ్సిడీ భరిస్తుందని తెలిపారు. కమిటీ సభ్యులు ఏపీ డ్రగ్ కంట్రోల్ అధికారి హరిహరతేజ, డీసీఓ శిరీష, షీప్ డెవలప్‌మెంట్ ఏడీ రవిప్రకాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


