● పేదలకు ఇళ్ల స్థలాల హామీ
గంగలో కలిపివేశారు
● అరోగ్యశ్రీకు తూట్లు పొడుస్తున్నారు!
● ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి
పత్తికొండ: చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత పేదల సంక్షేమాన్ని పక్కన పెట్టి గ్రాఫిక్స్ మాయాజాలంతో పరిపాలన చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అన్నారు. గురువారం పత్తికొండ పట్టణంలో ఎస్. రామచంద్రారెడ్డి, నాగరత్నమ్మ దంపతుల నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఎన్నికల్లో అధికారం కోసం చంద్రబాబు ఇచ్చిన హామీలను గద్దెనెక్కిన తరువాత పూర్తిగా మరచిపోయారన్నారు. ఆమరావతి నుంచి రాయలసీమ, ఉత్తరాంధ్రల వరకు అన్ని జిల్లాలో సమగ్ర అభివృద్ధి జరగాలని తమ పార్టీ అధినేత నిర్ణయం అని, రాజధానికి తాము ఎప్పటికీ వ్యతిరేకం కాదన్నారు. అక్కడ జరుగుతున్న భూదందాలకు, రైతులకు జరుగుతున్న అన్యాయాలకు, అక్రమాలకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ పోరాడుతోందన్నారు. తమ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 31వేల ఎకరాలను కోనుగోలు 31.19 లక్షల మంది నిరుపేదలకు పట్టాలు ఇచ్చిందన్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా పేదలకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మూడు, రెండు సెంట్లు స్థలం ఇచ్చి గృహాలు నిర్మిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని, ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదన్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో నిర్మించిన ఇళ్లకు రంగులు వేసి క్రెడిట్ చోరి చేసి గృహ ప్రవేశాలు చేసుకోవడం సిగ్గు చేటున్నారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అమలు చేస్తున్న నెట్‌వర్క్ అసుపత్రిలకు సకాలంలో బిల్లులు చెల్లించలేదన్నారు. ఫలితంగా గత రెండు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయడంతో పేదలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు డీఎ, పీఎఫ్, అరియర్స్ లాంటి బకాయిలు చెల్లించుకుండా దాదాపు రూ. 33 వేలు కోట్లు పెండింగ్ పెట్టినట్లు ఆరోపించారు. నమ్మి ఓట్లు వేసిన ప్రజలకు, ఉద్యోగులకు చంద్రబాబునాయుడు గ్రాఫిక్స్ మాయాజాలంలో పరిపాలనను చూపుతూ కాలం గడుపుతున్నారని మండిపడ్డారు.
చిత్తశుద్ధి లేదు
పేదలపై చంద్రబాబు సర్కార్‌కు చిత్తశుద్ధి లేదని వైఎస్సార్‌సీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, ఆలూరు నియోజకవర్గ పరిశీలకులు ఎస్ రామచంద్రారెడ్డి అన్నారు. చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చి రెండు ఏళ్ల గడిచినా నేటి వరకు కొత్త పింఛన్లు అందలేదన్నారు. జగనన్న హయాంలో 65 లక్షల మందికి పింఛన్లు అందజేశామన్నారు. ఈ రెండేళ్లలో దాదాపు 10 లక్షలు మంది పింఛన్‌దారులను కోతలు పెట్టి తగ్గించారన్నారు. విచ్చలవిడిగా అప్పులు చేయడం తప్ప పేదల సంక్షేమం కోసం పైసా కూడా ఖర్చు చేయడంలేదన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేయడంతో పేదలకు విద్య, వైద్య రంగాల్లో తీరని నష్టం కలుగుతోందన్నారు. జిల్లా పశ్చిమ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే వేదావతి, గుండ్రేవుల ప్రాజెక్టులు నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మేధావుల ఫోరం అధికార ప్రతినిధి శ్రీరంగడు, నాయకులు హోసూరు చంద్రశేఖర్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, వార్డు మెంబర్లు టైలర్ రంగన్న, రామాంజినేయులు, లింగన్న, మహమ్మద్, కాశీ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


