క్వింటా వేరుశనగ రూ.15,001
కర్నూలు(అగ్రికల్చర్): వేరుశనగ ధర రోజురోజుకు పెరుగుతోంది. రబీలో సాగు చేసిన రైతుల పంట పండుతోంది. 2023లో ఇదే నెలలో ఆదోని, ఎమ్మిగనూరు, కర్నూలు మార్కెట్‌లకు దాదాపు 5వేల క్వింటాళ్లకు పైగా వేరుశనగ వచ్చింది. 2024లో కూడా 3వేల క్వింటాళ్లు వచ్చింది. ఇప్పుడు 800 క్వింటాళ్లు మించని పరిస్థితి. ఈ నేపథ్యంలో మార్కెట్‌లో వేరుశనగ బంగారం అవుతోంది. ఎమ్మిగనూరు, ఆదోని మార్కెట్‌లతో పోలిస్తే కర్నూలు మార్కెట్‌లో వేరుశనగకు రికార్డు స్థాయి ధర లభిస్తుండటం విశేషం. కర్నూలు మార్కెట్‌కు గురువారం 319 క్వింటాళ్ల వేరుశనగ రాగా కనిష్ట ధర రూ.5,508, గరిష్ట ధర రూ.15,001 లభించగా.. సగటు ధర రూ.11,589 నమోదైంది. దేవనకొండ మండలం పి.కోటకొండ గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు 8 బస్తాల వేరుశనగ తీసుకురాగా క్వింటా రికార్డు స్థాయిలో రూ.15001 ధరతో కొనుగోలు చేశారు. అత్యదిక ధర పొందిన రైతు వెంకటేశ్వర్లును, కమీషన్ ఏజెంటును మార్కెట్ కమిటీ సెక్రటరీ జయలక్ష్మి, కమీషన్ ఏజెంట్లు సత్కరించారు.
● కందుల ధర క్రమంగా పెరుగుతోంది. మార్కెట్‌కు 4,076 క్వింటాళ్ల కందులు రాగా కనిష్ట ధర రూ.4,312, గరిష్ట ధర రూ.9,216 లభించగా.. సగటు ధర రూ.8,679 నమోదైంది.
● మార్కెట్‌కు 855 క్వింటాళ్ల వాము వచ్చింది. కనిష్ట ధర రూ.1,288, గరిష్ట ధర రూ.28,150 లభించగా.. సగటు ధర రూ.21,010 పలికింది.


