కేంద్ర బడ్జెట్‌లో చంద్రబాబు సాధించింది శూన్యం
● ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి
చిప్పగిరి: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026–27 బడ్జెట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు సాధించింది శూన్యం అని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి అన్నారు. స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఒక్క పోలవరానికి రూ. 3,300 కోట్లు తప్ప ఏమీ లేదన్నారు. నిత్యం ఢిల్లీ చుట్టూ తిరుగుతూ రాష్ట్రానికి చంద్రబాబు సాధించింది ఏముందని ప్రశ్నించారు. కేంద్రంలో కీలక భాగస్వామిగా ఉన్నామని గొప్పలు చెప్పుకునే వారు, ఏమి సాధించారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పన, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఎన్ని నిధులు తెచ్చారని ప్రశ్నించారు. ఇచ్చిన రూ. 3,300 కోట్లతో రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ఎలా పూర్తి చేస్తారన్నారు. రాష్ట్ర అభివృద్ధిపై కాకుండా చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపే వైఎస్సార్‌సీపీ నాయకులను అక్రమంగా అరెస్టులు చేయడంపై టీడీపీ నేతలు దృష్టి సారించారని ఆరోపించారు. కార్యక్రమంలో బుసినే శ్రీరాములు, వెంకటేష్, చంద్రశేఖర్, మహానంది, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.


