ఇంటి వద్దే పింఛన్లు మాటల్లోనే!
హాలహర్వి: చంద్రబాబు ప్రభుత్వం ఇంటింటికీ పింఛన్లు అందిస్తున్నట్లు గొప్పలు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉంటోంది. ప్రతినెలా వృద్ధులు, దివ్యాంగులు పింఛన్ల కోసం వేచి చూడాల్సి వస్తోంది. చింతకుంట గ్రామంలో శనివారం సచివాలయ సిబ్బంది ఓ ఆలయం వద్దకు కూర్చొని పింఛన్లుదారులను అక్కడికే రప్పించుకున్నారు. దీంతో ఇళ్ల నుంచి పింఛను పంపిణీ ప్రాంతాలకు చేరుకునేందుకు లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు.
కర్నూలు(అగ్రికల్చర్): ఇంటి దగ్గరే పింఛన్ల పంపిణీ నోటి మాటలకే పరిమితమవుతోంది. 2024 జూలై నుంచి ఇంటి దగ్గరే పింఛన్లు అంటూ హడావుడి చేస్తున్నా ఆచరణలో 20 నుంచి 30 శాతం వరకే పంపిణీ జరుగుతోంది. శనివారం ఉమ్మడి జిల్లాలో చేపట్టిన ఫిబ్రవరి నెల పింఛన్ల పంపిణీ కూడా అస్తవ్యస్తంగా సాగింది. సర్వర్ సమస్యల కారణంగా పంపిణీ ఆలస్యమైంది. 10 గంటల వరకు సర్వర్ వేధించడంతో అవ్వాతాతలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 10 గంటల తర్వాత సచివాలయాల్లోనే పంపిణీ చేయడంతో అతి కష్టం మీద వృద్ధులు, దివ్యాంగులు అవస్థలు పడుతూ సచివాలయాల మెట్లు ఎక్కాల్సి వచ్చింది. కల్లూరులో పింఛన్లు ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేసిన దాఖలాల్లేవు. కోడుమూరు, సీ.బెళగల్, కర్నూలు, ఆదోని, డోన్, బనగానపల్లి, అవుకు తదితర ప్రాంతాల్లో ఇంటిదగ్గర పింఛన్ల పంపిణీ నామమాత్రానికే పరిమితమైంది. ఇదిలాఉంటే కర్నూలులోని కొత్తపేటలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి పింఛన్ల పంపిణీ చేపట్టారు. సాయంత్రం 6 గంటల సమయానికి కర్నూలు జిల్లాలో 91.53 శాతం పంపిణీ చేసినట్లు అధికారులు ప్రకటించారు. నంద్యాల జిల్లాలో 2,13,117 పింఛన్లు ఉండగా 1,94,311 పంపిణీ చేశారు. ఈ జిల్లాలో 91.18 శాతం పంపిణీ పూర్తయింది.
ఇంటి వద్దే పింఛన్లు మాటల్లోనే!


