దురుద్దేశంతోనే..
ఎన్నికల వాగ్దానాలను అమలు చేయలేక, పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే చంద్రబాబు ప్రభుత్వం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై విష ప్రచారం చేసిందని ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి మండిపడ్డారు. తిరుమల లడ్డూలో వినియోగించిన నెయ్యి జంతువుల కొవ్వుతో కల్తీ జరిగిందని తప్పుడు ప్రచారం చేసిన కూటమి ప్రభుత్వ నేతల వక్రబుద్ధి మారాలని కోరుతూ శనివారం రుద్రవరం మండలం శ్రీ వాసాపురం వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి పరిహార పూజలు నిర్వహించారు. ఆళ్లగడ్డ నుంచి రుద్రవరం చేరుకున్న ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి గ్రామ శివారు నుంచి దేవాలయం వరకు ర్యాలీగా చేరుకున్నారు. అక్కడ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి 101 కొబ్బరి కాయలు కొట్టారు.


