ఆర్టీసీ బస్సులో పొగలు
వెల్దుర్తి: కల్లూరు మండల పరిధిలోని ఉలిందకొండ హైవేపై శనివారం ఆర్టీసీ బస్సులో పొగలు వచ్చాయి. డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులంతా క్షేమంగా బయటపడ్డారు. డోన్ డిపోకు చెందిన పల్లెవెలుగు బస్సు కర్నూలుకు వెళ్లి 79 మంది ప్రయాణికులతో తిరిగివస్తోంది. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో చిన్నటేకూరు వద్ద బస్సులో ప్రారంభమైన ఉలిందకొండ హైవేపై ఎక్కువయ్యాయి. ప్రమాదాన్ని పసిగట్టిన డ్రైవర్ కుమార్ బస్సును ఆపి ప్రయాణికులను దిగమనడంతో తోపులాట జరిగింది. పలువురు చిన్నారులు, యువతులు స్వల్పగాయాలకు గురయ్యారు. కొందరు ఆందోళనకు గురై బస్సుల కిటికీల నుంచి కిందకు దూకేశారు. బస్సు చాలా పాతది కావడం, లోడు ఎక్కువగా ఉండటంతో ఇంజిన్ వద్ద ఉన్న రేడియేటర్‌పై భారం పడి పొగలు వచ్చినట్లు డ్రైవర్ గుర్తించారు. ఇదే హైవే ప్రాంతంలో ప్రైవేట్ బస్సు దగ్ధమైన సంఘటన, ఇటీవల నంద్యాల జిల్లాలో శిరివెళ్ల వద్ద మరో బస్సు దుర్ఘటన గుర్తుకు వచ్చి ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి మంచి బస్సులను నడపాలని కోరారు.


