మరింత పడిపోయిన కందులు, వేరుశనగ ధరలు | - | Sakshi
Sakshi News home page

మరింత పడిపోయిన కందులు, వేరుశనగ ధరలు

Feb 5 2026 7:24 AM | Updated on Feb 5 2026 7:24 AM

మరింత పడిపోయిన కందులు, వేరుశనగ ధరలు

మరింత పడిపోయిన కందులు, వేరుశనగ ధరలు

కర్నూలు(అగ్రికల్చర్‌): కర్నూలు వ్యవసాయ మార్కెట్‌ యార్డులో కందులు, వేరుశనగ ధరలు పడిపోతున్నాయి. ప్రధానంగా కందుల ధర పడిపోతుండటం రైతులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. గరిష్టంగా క్వింటా రూ.9,200 చేరిన కందుల ధర తాజాగా రూ.8వేల లోపునకు పడిపోయింది. మార్కెట్‌కు కందులు 3,655 క్వింటాళ్లు వచ్చాయి. కనిష్ట ధర రూ.2,609, గరిష్ట ధర రూ.7,901 లభించింది. సగటు ధర రూ.7,801 నమోదైంది. ఎమ్మిగనూరు, ఆదోని మార్కెట్లలో కందుల ధరలు మరింత అధ్వానంగా ఉంటున్నాయి. కాగా వేరుశనగ ధర గతంలో ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో రూ.15వేలకు చేరింది. ఈ ధర మూన్నాళ్ల ముచ్చటగా మారింది. మరుసటి రోజు నుంచే ధర తగ్గుతుండటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. కర్నూలు మార్కెట్‌కు 406 క్వింటాళ్ల వేరుశనగ వచ్చాయి. కనిష్టంగా రూ.5,625, గరిష్ట ధర రూ.9,018 లభించింది. నాలుగైదు రోజుల వ్యవధిలోనే క్వింటాపై రూ.6 వేల వరకు తగ్గడం గమనార్హం.

వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి

గోనెగండ్ల: చదువులో వెనుకబడిన విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని డీఈఓ సుధాకర్‌ సూచించారు. బుధవారం మండల కేంద్రం గోనెగండ్లలోని మండల పరిషత్‌ ప్రాథమిక(హరిజన వాడ)పాఠశాల, కస్తూర్భాగాంధీ బాలికల పాఠశాలలను జిల్లా విద్యాశాఖ అధికారి సుధాకర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కస్తూర్భాగాంధీ బాలికల పాఠశాల విద్యార్థినీలతో మాట్లాడి వివిధ సబ్జెక్టులలో వారి సామర్థ్యాలను తెలుసుకున్నారు. అనంతరం సమాధాన పత్రాల మూల్యాంకనం తీరుతెన్నులను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ వంద రోజుల కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా పరీక్షలు నిర్వహించి వెనుకబడిన వారికి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది పదిలో వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఆయన వెంట జేఎస్‌డబ్ల్యూ స్నేహలత, ఎంఈఓలు రామాంజినేయులు, నీలకంఠ, ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు ఉన్నారు.

సీఎం పర్యటనకు నాలుగు జిల్లాల పోలీసులు

కర్నూలు: ముఖ్యమంత్రి ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామంలో ఈనెల 6న పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న నేపథ్యంలో బందోబస్తుకు నాలుగు జిల్లాల పోలీసులను వినియోగిస్తున్నారు. కర్నూలు, నంద్యాల, కడప, అన్నమయ్య జిల్లాల నుంచి దాదాపు 1,200 మంది పోలీసులను బందోబస్తు విధులకు వినియోగిస్తున్నట్లు ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ముగ్గురు అడిషనల్‌ ఎస్పీలు, 8 మంది డీఎస్పీలు, 55 మంది సీఐలు, 88 మంది ఎస్‌ఐలు, 297 మంది ఏఎస్‌ఐలు, హెడ్‌ కానిస్టేబుళ్లు, 485 మంది కానిస్టేబుళ్లు, 61 మంది మహిళా పోలీసులు, 191 మంది హోంగార్డులు, రెండు సెక్షన్ల ఏఆర్‌ పోలీసులు, 14 స్పెషల్‌ పార్టీ బృందాలను బందోబస్తు విధులకు వినియోగిస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు.

ప్రత్యేక అధికారిగా ఆజాద్‌

శ్రీశైలం టెంపుల్‌: శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 8 నుంచి 18వ తేదీ వరకు నిర్వహిస్తున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల పర్యవేక్షణకు ఉత్సవాల ముఖ్య అధికారిగా ఎస్‌.ఎస్‌.చంద్రశేఖర ఆజాద్‌ను నియమిస్తూ దేవదాయశాఖ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. దేవస్థానం ఈఓ ఎం.శ్రీనివాసరావు ఆదేశాల మేరకు బుధవారం ఆయనకు సిబ్బందిని నియమించారు. వసతి గది, అటెండర్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని పీఆర్వోను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement