వ్యక్తిగత కక్షలతోనే హత్య | - | Sakshi
Sakshi News home page

వ్యక్తిగత కక్షలతోనే హత్య

Feb 5 2026 7:24 AM | Updated on Feb 5 2026 7:24 AM

వ్యక్తిగత కక్షలతోనే హత్య

వ్యక్తిగత కక్షలతోనే హత్య

బొందిమడుగుల రమేష్‌ హత్య కేసు ఛేదించిన పోలీసులు

పత్తికొండ: ఏపీ ఎంఆర్‌పీఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బొందిమడుగుల రమేష్‌ను వ్యక్తిగత కక్షలతోనే ప్రత్యర్థులు హత్య చేసినట్లు డీఎస్పీ వెంకటరామయ్య తెలిపారు. బుధవారం ఆయన స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితులను అరెస్టు చూపి వివరాలను వెల్లడించారు. బొందిమడుగుల గ్రామానికి చెందిన రమేష్‌ ఏపీ ఎంఆర్‌పీఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా పనిచేస్తూ సామాజికవర్గ సమస్యలపై చురుగ్గా స్పందిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అదే గ్రామంలోని మైనార్టీ వర్గానికి చెందిన షేక్‌ సుభాన్‌వలి కుటుంబంతో కొద్ది రోజుల క్రితం వివాదం చోటు చేసుకుంది. గతంలో అదే గ్రామానికి చెందిన ఓ మహిళను వేధించారన్న కారణంతో సుభాన్‌వలి కుటుంబ సభ్యుల్లో ఒకరిపై తుగ్గలి పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. అంతేకాకుండా సుభాన్‌ కుటుంబ సభ్యులకు చెందిన ఇంటి పక్కనున్న స్థలం సమస్యలో రమేష్‌ జోక్యం చేసుకొని కొంత స్థలాన్ని అవతలి వర్గానికి ఇప్పించడంతో కక్ష పెంచుకున్నారు. సమీప బంధువైన లింగనేనిదొడ్డి గ్రామానికి చెందిన షేక్‌ మహమ్మద్‌ పొలం విషయంలోనూ రమేష్‌ కలుగజేసుకొని పొలం సర్వే చేయించడంతో పాటు దాదాపు 2 ఎకరాలు ఇతరులకు స్వాధీనం కావడానికి కారణమయ్యాడనే బాధ పెంచుకున్నారు. ప్రతి పనిలో అడ్డుతగులుతూ ఆర్థికంగా నష్టం చేస్తుండటంతో రమేష్‌ను అంతమొందించేందుకు నిర్ణయించుకున్నారు.

వాకింగ్‌కు వెళ్లిన సమయంలో..

గత జనవరి 30న సాయంత్రం గ్రామంలో తన నివాసం నుంచి బొందిమడుగుల రమేష్‌ కృష్ణగిరి మండలం బోయబొంతిరాళ్ల గ్రామం వైపు వాకింగ్‌కు వెళ్లాడు. ఇదే అదనుగా భావించి నిందితులు ట్రాక్టర్‌ ఇంజిన్‌తో ఢీకొట్టారు. ఇనుపరాడ్డులు, రాళ్లతో విచక్షణా రహితంగా దాడి చేశారు. గమనించిన స్థానికులు కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారయ్యారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు అక్కడికి చేరుకుని రమేష్‌ను చికిత్స నిమిత్తం కర్నూలుకు తరలించారు. అయితే కోలుకోలేక ఈనెల 31న మరణించాడు.

నిందితులు అరెస్టు

కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు తుగ్గలి ఇన్‌చార్జి ఎస్‌ఐ మల్లికార్జున ఎస్సీ, ఎస్టీ, అట్రాసీటితో పాటు హత్య కేసు నమోదు చేశారు. అనంతరం జిల్లా ఎస్పీ ఆదేశాలు మేరకు డీఎస్పీ వెంకటరామయ్య దర్యాప్తు అధికారిగా బాధ్యతలు తీసుకున్నారు. హత్య కేసును పూర్తిస్థాయిలో విచారించి బుధవారం తుగ్గలి మండలం రాతన గ్రామం చెరువుకట్ట దగ్గర షేక్‌ సుభాన్‌వలి, షేక్‌ హుశేన్‌పీరా, షేక్షావలి, షేక్‌ షేక్షావలి, షేక్‌ మాబాషా, షేక్‌ షాకీర్‌, షేక్‌ షరీఫ్‌, సయ్యద్‌ అబ్దుల్లా, సయ్యద్‌ లాల్‌బాషా, షేక్‌ మౌళాలి, షేక్‌ మహమ్మద్‌లను అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన ఇనుపరాడ్డులను పత్తికొండ మండలం చందోళి క్రాస్‌రోడ్డు వద్ద స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. కేసును త్వరితగతిన ఛేదించేందుకు సహకరించిన రూరల్‌ సీఐ పులిశేఖర్‌, ఎస్‌ఐ మల్లికార్జున, పోలీసు సిబ్బందిని ఆయన అభినందించారు. ఇదిలాఉంటే పాతకక్షలతో జరిగిన హత్యకు తనపై వ్యక్తిగత ఆరోపణలు చేయడం బాధ కలిగించిందన్నారు. వారందరిపై న్యాయ సలహా తీసుకొని చట్టపరంగా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు.

12 మంది అరెస్టు

హత్యకు ఉపమోగించిన

ఆయుధాలు స్వాధీనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement