పకడ్బందీగా పది పరీక్షలు
● మూడు జిల్లాల ప్రిన్సిపాళ్లతో
ఏపీ మోడల్ స్కూల్ జేడీ
నంద్యాల(న్యూటౌన్): పదవ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని, ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఏపీ మెడల్ స్కూల్ జాయింట్ డైరెక్టర్ తాహెరా సుల్తానా అన్నారు. బుధవారం నంద్యాల డిప్యూటీ డీఈఓ కార్యాలయ సమావేశ భవనంలో మూడు జిల్లాలకు చెందిన ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపాళ్లు, విద్యాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరీక్షల నిర్వహణపై వదంతులు నమ్మవద్దన్నారు. పది విద్యార్థులకు అమలు చేస్తున్న వంద రోజుల యాక్షన్ ప్లాన్ పక్కాగా అమలు చేయాలన్నారు. పది పరీక్షలు కట్టుదిట్టంగా జరుగుతాయని, ఇందులో ఎలాంటి సందేహం వద్దన్నారు. విద్యార్థులు చదవకుండా పాస్ కావాలని కోరుకోకూడదని తెలిపారు. విద్యాశాఖ అధికారులు సమన్వయంతో ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేయాలన్నారు. పదవ తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో పాటు ప్రతి రోజు పరీక్షలు నిర్వహించాలన్నారు. తర్వాత ఇంటర్ ప్రీ ఫైనల్ ఫలితాలపై సమీక్షించారు. ఈ ఏడాది పది, ఇంటర్‌లో వందశాతం ఫలితాలు రావాలని ఆదేశించారు. సమావేశంలో నంద్యాల డీఈఓ జనార్ధన్‌రెడ్డి, డిప్యూటీ డీఈఓ శంకర్ ప్రసాద్, డోన్ డిప్యూటీ డీఈఓ వెంకటరామిరెడ్డి, కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.


