బాబుపాలనలో బిహార్‌గా మారిన ఏపీ
● రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోంది ● వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి పాటిల్ తిరుమలేశ్వర రెడ్డి
కర్నూలు (టౌన్): చంద్రబాబు రెండేళ్ల పాలనలో దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులతో ఆంధ్రపద్రేశ్ బిహార్‌గా మారిందని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి పాటిల్ తిరుమలేశ్వర రెడ్డి విమర్శించారు. మంగళవారం స్థానిక ఎస్వీ కాంప్లెక్స్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో అరాచకపాలన నడుస్తోందన్నారు. ఇది మంచి సంప్రదాయం కాదన్నారు. ఎల్లకాలం ఇదే ప్రభుత్వం కొనసాగదన్నారు. వైఎస్సార్‌సీపీకి చెందిన మాజీ మంత్రుల ఇళ్లపై దాడులు, పెట్రోలు బాంబులు వేసి ఇళ్లను తగలబెట్టడం, మహిళా మాజీ మంత్రి విడదల రజనిపై టీడీపీ గుండాలు దాడులు చేయడం దారుణమన్నారు. ఏపీకి బిహార్ సంస్కృతిని తీసుకువస్తున్నారన్నారు. కూటమ సర్కారు రెండేళ్ల పాలనలో రెడ్ బుక్ అమలు తప్ప.. సంక్షేమ పాలన కనిపించడం లేదన్నారు. ప్రశ్నిస్తే వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తల గొంతు నొక్కే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఇండియాలో కాకుండా పాకిస్తాన్‌లో ఉన్నామా... అన్న అనుమానాలు వస్తున్నాయన్నారు. మీరు అన్ని రంగాల్లో ఘోరంగా వైఫల్యం చెందడం నిజం కాదా అని చంద్రబాబును ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను అభాసుపాలు చేసేందుకు పవిత్ర తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని దుష్ప్రచారం చేసిన చంద్రబాబుకు సీబీఐ సిట్ ఇచ్చిన నివేదిక చెంప పెట్టులాంటిదన్నారు.అయినా, వారు మారలేదని ప్రజలను మోసం చేయడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతున్న డీజీపీ స్పందించకపోవడం విచారకరమన్నారు.


