గ ‘మ్మత్తు’గా దొరికిపోతున్నారు!
● 23 రోజుల్లో 582 డ్రంకెన్ డ్రైవ్ కేసులు
● రూ.58.20 లక్షలు జరిమానా
కర్నూలు: మద్యం తాగి వాహనాలు నడపొద్దంటున్నా మద్యంప్రియులు పెడచెవిన పెడుతున్నారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ పోలీసులకు పట్టుబడుతున్నారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి 23వ తేదీ వరకు 582 మంది మందుబాబులు తనిఖీల్లో పోలీసులకు దొరికిపోయారు. వారిని న్యాయస్థానంలో హాజరుపర్చగా ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున న్యాయస్థానం జరిమానా విధించారు. ఈ లెక్కన 23 రోజుల్లో రూ.58 లక్షలు మందుబాబులు మూల్యం చెల్లించారు. అలాగే 23 రోజుల్లో 627 మందిపై ఓవర్ స్పీడ్ కేసులు, 585 మంది హెల్మెట్ ధరించకపోవడంతో కేసులు నమోదయ్యాయి. అలాగే సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేస్తూ 89 మంది వాహనదారులు పట్టుబడగా వారిపై ఈ–చలానాలు నమోదు చేశారు. 986 మంది బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ పట్టుబడ్డారు. రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా పోలీసులు జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ వాహనదారులు ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. ఓవర్ స్పీడ్, ఓవర్ లోడ్, మైనర్లు వాహనం నడపటం, సెల్‌ఫోన్ డ్రైవింగ్ వంటి కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రతి శనివారం జిల్లా వ్యాప్తంగా రహదారి భద్రత నియమాలపై పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. వాహనదారులు రహదారి భద్రత నియమాలు పాటిస్తే ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని, తనిఖీల సందర్భంగా అధికారులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ మార్పు కనిపించడం లేదు.


