పెద్దాసుపత్రి డైట్ టెండర్ మాకే దక్కాలి!
● అధికారులపై ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు
● మొత్తం 15 మంది టెండర్ దాఖలు
● వీరిలో అనర్హులే అధికం
కర్నూలు(హాస్పిటల్): ‘చూడండి సార్...! మీరేం చేస్తారో మాకు తెలియదు...ఈసారి ఆసుపత్రి డైట్ టెండర్ మావాడికే రావాలి. ఇందుకు సంబంధించి నిబంధనలు ఏమైనా ఉంటే మీరు చూసుకోండి. ఇతర విషయాలే మైనా ఉంటే నేను చూసుకుంటాను. ఉన్నతాధికారులు కూడా మాకు సపోర్ట్‌గానే ఉన్నారు. మీరు అలాగే ఉండాలి’ అంటూ ఆసుపత్రి అధికారులకు కొందరు ప్రజాప్రతినిధులు ఒత్తిళ్లకు గురిచేస్తున్నారు. ఈ మేరకు కొందరు తమ అనుచరుల ద్వారా, మరికొందరు స్వయంగా ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని డైట్ విభాగానికి (రోగులకు ఆహారం సరఫరా చేసే) టెండర్ పిలిచారు. ఈ మేరకు బుధవారం టెండర్ దాఖలు చేసేందుకు చివరి రోజు. మొత్తం 15 మంది టెండర్ వేశారు. వీరిలో హైదరాబాద్, తిరుపతి, ఒంగోలు, కడప, విశాఖపట్టణం, గుంటూరు ప్రాంతానికి చెందిన వారూ ఉన్నారు. ఇందులో ఇప్పటి వరకు ఆసుపత్రికి ఆహారాన్ని సరఫరా చేసిన వారితో పాటు స్థానికంగా హోటళ్లు, మెస్‌లు, క్యాటరింగ్ సర్వీస్‌లు, బిర్యానీ పాయింట్‌లు నిర్వహించే వారూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే, మొత్తం 15 మందిలో నలుగురైదుగురు మాత్రమే టెండర్‌కు అర్హులవుతారన్న చర్చ నడుస్తోంది. కానీ మిగిలిన వారు, స్థానికులు కొందరు కూటమికి చెందిన ప్రజాప్రతినిధుల వద్దకు వెళ్లి టెండర్ తమకే వచ్చేలా చేయాలని కోరినట్లు సమాచారం. దీంతో సదరు నేతలు సైతం అధికారులకు టెండర్ తమ వారికి వచ్చేలా చూడాలని ఆదేశించినట్లు తెలిసింది. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రోగులకు ఆహారం సరఫరా చేయాలంటే 500 పడకలకు పైగా ఉన్న బోధనాసుపత్రుల్లో ఇది వరకు సరఫరా చేసి ఉండాలి. ఇలా ఆహారం సరఫరా చేసిన దానికి ఏడాదికి రూ.25 లక్షలు వార్షిక టర్నోవర్ కలిగి ఉండాలి వంటి నిబంధనలు ఉన్నాయి. ఇవేమీ లేకున్నా కొందరు తాము కూడా రోగులకు ఆహారం సరఫరా చేస్తామని చెప్పి ముందుకు రావడంతో ఈసారి టెండర్‌లో పోటీ పెరిగింది. కొందరు ప్రజాప్రతినిధులకు చెందిన అనుచరులైతే తాము ఉన్నతాధికారులతో సైతం ఒప్పించుకున్నామని, టెండర్ తమకే లభిస్తుందని, మాకు అడ్డురావద్దని టెండర్ వేసేందుకు వచ్చిన వారిని బెదిరించినట్లు సమాచారం. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఒక్కో రోగికి రోజుకు ఆహారాన్ని అందించేందుకు రూ.38 ఇచ్చేవారు. ఈ మొత్తానికి బయట టిఫిన్ కూడా రాదని భావించి గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం డైట్ ఛార్జీలు పెంచి రోజుకు రూ.80కు పెంచింది. దీనిపై మూడేళ్ల క్రితం టెండర్‌దారులు పోటీ పడి రూ.72 కు కోడ్ చేసి టెండర్ దక్కించుకున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో రోగులకు, వైద్యులు, వైద్య విద్యార్థులకు ఆహారాన్ని సరఫరా చేసేందుకు నెలకు రూ.30 లక్షల వరకు ఖర్చు అవుతోంది. ఏడాదికి రూ.3.60 కోట్లకు పైగా టర్నోవర్ ఉంటోంది. దీంతో ఈసారి ఆసుపత్రి డైట్‌పై ఆశావహుల కన్నుపడి పోటీ పెరిగింది. కాగా షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 5వ తేదీన టెండర్ బాక్స్‌ను జాయింట్ కలెక్టర్ సమక్షంలో తెరిచి టెండర్‌దారును ఖరారు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.


