ఆర్‌ఎస్‌ఐను అభినందించిన ఎస్పీ
కర్నూలు: జిల్లా పోలీసు శాఖలో రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఎస్‌ఐ)గా పనిచేస్తున్న మేడగం సురేష్ రెడ్డి గ్రూప్–2లో జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో (జీఏడీ) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఏఎస్‌ఓ) ఉద్యోగం సాధించారు. పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తూనే ఇటీవల నిర్వహించిన ఏపీపీఎస్సీ గ్రూప్–2 ఫలితాల్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా ఎంపికై న సందర్భంగా ఎస్పీ విక్రాంత్ పాటిల్‌ను ఆయన కార్యాలయంలో సురేష్ రెడ్డి బుధవారం పూలమొక్క ఇచ్చి మర్యాదపూర్వకంగా కలిశారు. కఠినమైన విధి నిర్వహణతో పాటు పోటీ పరీక్షల్లో విజయం సాధించడం అభినందనీయమని ఎస్పీ ఈ సందర్భంగా ఆయనను ప్రశంసించారు. పోలీసు శాఖలో పనిచేస్తూ కూడా ఉన్నత లక్ష్యాలను సాధించవచ్చని ఈ విజయం ద్వారా నిరూపితమైందని ఎస్పీ పేర్కొన్నారు. ఇతర పోలీసు సిబ్బందికి కూడా ఇది స్ఫూర్తిదాయకమన్నారు. భవిష్యత్తులో గ్రూప్–1 లక్ష్యంతో ఇదే పట్టుదల, కృషితో సాధించాలని ఎస్పీ ఆకాంక్షించారు.
ఆర్‌ఎస్‌ఐ నేపథ్యం...
అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం బొందలదిన్నె గ్రామానికి చెందిన వెంకటరామిరెడ్డి, వెంకటసుబ్బమ్మ దంపతుల కుమారుడు సురేష్ రెడ్డి బీటెక్ పూర్తి చేసి 2015లో ఆర్‌ఎస్‌ఐగా పోలీసు శాఖలో చేరారు. వీరిది వ్యవసాయ కుటుంబం. 2025 ఫిబ్రవరి 23న నిర్వహించిన గ్రూప్–2 మెయిన్స్ పరీక్షలో 300 మార్కులకు గాను 230 మార్కులు సాధించారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయం (సెక్రెటేరియట్)లో ఏఎస్‌ఓ ఉద్యోగం సాధించారు.


