ఐదు రోజుల పని విధానం కావాలి
● బ్యాంకుల్లో తీవ్ర పని ఒత్తిడితో ఉద్యోగులు అనారోగ్యాల బారిన పడుతున్నారు ● యూఎఫ్‌బీయూ జిల్లా కన్వీనర్ నాగరాజు ఆవేదన ● బ్యాంకుల సమ్మెతో స్తంభించిన లావాదేవీలు
కర్నూలు(అగ్రికల్చర్): బ్యాంకు ఉద్యోగులు తీవ్ర పని ఒత్తిడి కారణంగా మానసిక వేదనకు గురవుతున్నారు. కొందరు అనారోగ్యాలకు గురై మరణిస్తున్నారు. ఈ పరిస్థితుల నుంచి బయట పడాలంటే వారంలో ఐదు రోజుల పని దినాలు అవసరమని యూనైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) జిల్లా కన్వీనర్ నాగరాజు అన్నారు. ఐదు రోజుల పని దినాలు అమలు చేయాలనే ప్రధాన డిమాండ్‌తో యూఎఫ్‌బీయూ పిలుపు మేరకు మంగళవారం ఉమ్మడి జిల్లాలో బ్యాంకుల సమ్మె కార్యక్రమం చేపట్టారు. ఈ నెల 24 నుంచి 26 వరకు సెలవులు ఉండటం, 27న బ్యాంకులు సమ్మె పాటించడంతో లావాదేవీలు స్తంభించిపోయాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 650 బ్యాంకు శాఖల్లో సేవలు నిలిచిపోయాయి. బ్యాంకుల సమ్మె నేపథ్యంలో కర్నూలులోని ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచ్ ఎదుట యూఎఫ్‌బీయూ జిల్లా కన్వీనర్ నాగరాజు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. అన్ని బ్యాంకుల యూనియన్ల నాయకులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో యూఎఫ్‌బీయూ జిల్లా నేతలు మాట్లాడుతూ.. బ్యాంకు యూనియన్‌లు పదేళ్లుగా చేస్తున్న డిమాండ్‌ల్లో వారంలో ఐదు రోజుల పని దినాలు కల్పించాలనేదే ప్రధానమైందని పేర్కొన్నారు. ఈ డిమాండ్‌ను 2023 డిసెంబరు 7న బ్యాంకు యూనియన్‌లతో జరిపిన చర్చల్లో ఐబీఏ అంగీకరించిందని తెలిపారు. 2024 మార్చి 8న జరిగిన 12వ వేతన ఒప్పందంలో కూడా ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం ప్రతిపాదనలు పంపిందని వివరించారు. అయితే, అక్కడి నుంచి స్పందన లేదని ఆందోళన వ్యక్తం చేశారు. డిజిటల్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఏటీఎంలు, క్యాష్ డిపాజిట్ మిషన్లు తదితర సాంకేతికత అందుబాటులో వచ్చినందున ఐదు రోజుల పని విధానంతో ఖాతాదారులకు ఇబ్బంది ఉండదని వివరించారు. కార్యక్రమంలో యూఎఫ్‌బీయూ జిల్లా కన్వీనర్ నాగరాజు, ఏఐబీఈఏ నాయకులు అనిల్‌కుమార్‌రెడ్డి, ఎల్లయ్య, వాసుదేవరెడ్డి, ఏఐబీవోసీ నాయకులు జియా ఉర్ రహిమాన్, రాజు, పుష్పక్ కుమార్, ఎన్‌సీబీఈ నాయకులు విద్యాసాగర్, ఏపీజీబీ నాయకులు హనుమంతురెడ్డి, వాసు, సీఐటీయూ నాయకులు అంజిబాబు, మునెప్ప, ఎల్‌ఐసీ, జీఐసీ నాయకులు సునీల్ కుమార్, రఘుబాబు తదితరులు పాల్గొన్నారు.


