టూరిజం అభివృద్ధికి కృషి
కర్నూలు(అర్బన్): జిల్లాలో టూరిజం అభివృద్ధికి అన్ని విధాల కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో టూరిజం అభివృద్ధి కమిటీ సమావేశాన్ని చైర్మన్ హోదాలో జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అందుబాటులోని వనరులను సద్వినియోగం చేసుకొని టూరిజం అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఓర్వకల్ రాక్ గార్డెన్ ఉత్సవాల నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా టూరిజం అధికారి లక్ష్మినారాయణ, సెట్కూరు సీఈఓ వేణుగోపాల్‌ను ఆదేశించారు. గాజులదిన్నె ప్రాజెక్టు, సుంకేసుల ప్రాజెక్టు, ఆదోని రాంజల వాటర్ ట్యాంక్‌లో బోటింగ్, రెస్టారెంట్స్, మౌలిక సదుపాయాల కల్పనకు నివేదికలు తయారు చేయాలన్నారు. కర్నూలు జిల్లాతో పాటు ఇతర జిల్లాల్లోని దేవాలయాల సందర్శనకు టెంపుల్ టూరిజంను అభివృద్ధి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా టూరిజం అధికారి లక్ష్మినారాయణ మాట్లాడుతూ రూ.14 కోట్లతో జిల్లాలో టూరిజం అభివృద్ధికి ఐదు నివేదికలు రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించామన్నారు. సమావేశంలో సెట్కూరు సీఈఓ వేణుగోపాల్, దేవదాయ అసిస్టెంట్ కమిషనర్ సుధాకర్‌రెడ్డి, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ తేజశ్వి, ఇన్‌చార్జి డ్వామా పీడీ మాధవీలత, టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నారాయణ, టూరిజం కమిటీ సభ్యుడు పత్తి ఓబులయ్య, సీపీఓ భారతి, ఇరిగేషన్ ఎస్‌ఈ బాలచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


