● లీలా వెంకటశేషాద్రి
కర్నూలు: రష్యా సాయుధ దళాల్లో చేరి మరణించిన భారతీయులపై ఆధారపడిన కుటుంబ సభ్యులు/చట్టబద్ధ వారసులకు ఉచిత న్యాయ సహాయం అందివ్వనున్నట్లు న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి తెలిపారు. భారత సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాలు అమలులో భాగంగా కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన భారతీయ పౌరులు రష్యా సాయుధ దశాలలో చేరి మరణించినట్లయితే వారి కుటుంబ సభ్యులు/చట్టబద్ధ వారసులు తమ వద్ద అందుబాటులో ఉన్న వివరాలు, సంబంధిత పత్రాలతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో సూచించారు. బాధిత కుటుంబాల వివరాలను గుర్తించడం, వారి క్లెయిమ్‌లు/ఫిర్యాదులను స్వీకరించడం, పరిహారం పొందేందుకు సమర్ధ అధికారుల వద్ద తదుపరి చర్యలు చేపట్టడానికి అవసరమైన న్యాయ సహాయం మార్గదర్శకత్వం అందించనున్నట్లు తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా న్యాయ సహాయం పూర్తిగా ఉచితంగా అందించనున్నట్లు పేర్కొన్నారు. కర్నూలులోని జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయ సేవా సదన్ నందు న్యాయ సేవాధికార సంస్థలో సంప్రదించాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. వివరాలకు 08518–248821 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు.
21 వరకు నవజాత శిశు ఆరోగ్య వారోత్సవాలు
కర్నూలు(హాస్పిటల్): నవజాత శిశు ఆరోగ్య వారోత్సవాలు జిల్లాలో ఈ నెల 15 నుంచి 21వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిణి డాక్టర్ ఉమ తెలిపారు. సోమవారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని చిన్నపిల్లల విభాగంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. నవజాత శిశు సంరక్షణ కేంద్రాలు(ఎస్‌ఎన్‌సీయూ), నవజాత శిశు అత్యవసర చికిత్సా కేంద్రాల(ఎన్‌ఐసీయూ) నుంచి చికిత్స అనంతరం ఇళ్లకు చేరిన శిశువులకు క్రమం తప్పకుండా అవసరమైన పరీక్షలు నిర్వహించి సంరక్షించడమే లక్ష్యమని చెప్పారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా ఆన్‌లైన్ సమావేశాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో ప్రత్యేక శిక్షణ అందిస్తామన్నారు. వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి చిన్నారుల ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షించడం, అవసరమైన సేవలు ఎప్పటికప్పుడు అందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. కార్యక్రమంలో పీడియాట్రిక్ హెచ్‌ఓడీ డాక్టర్ సుహాసిని, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
20న జెడ్పీ చైర్మన్ ఎన్నిక
నంద్యాల(అర్బన్): ఈ నెల 20న జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్, కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. సోమవారం ఆమె పట్టణంలోని జెడ్పీ కార్యాలయాన్ని పరిశీలించి చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ నిబంధనల ప్రకారం సజావుగా జరిగేలా చూడాలన్నారు. కలెక్టర్ వెంట జిల్లా పరిషత్ సీఈఓ శివశంకర్ ఉన్నారు.


