సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందులలో వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఎంపీని హౌస్ అరెస్ట్ చేసేందుకు యత్నింస్తున్నారు. పంచాయతీ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా చంద్రబాబు సర్కార్ కుట్రలకు తెరలేపింది. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ఎటూ కదలనివ్వకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు.
మరో వైపు, వేంపల్లిలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి ఇంటి దగ్గర కూడా భారీగా పోలీసులు మోహరించారు. సతీష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, పోలీసులు అర్ధరాత్రి తమ ఇళ్ల వద్దకు వచ్చి ఇబ్బందులు పెడుతున్నారంటూ వైఎస్ అవినాష్‌రెడ్డికి పులివెందుల మండలం కణంపల్లి గ్రామానికి చెందిన మహిళలు మొర పెట్టుకున్నారు.
పులివెందుల, కమలాపురం నియోజకవర్గాల్లో ఇవాళ (బుధవారం) నుంచి నామినేషన్లు ప్రారంభం కానున్నాయి. పులివెందుల పరిధిలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు నామినేషన్లు అడ్డుకోవాలంటూ సీఎంఓ నుంచి ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. ఈ మేరకు మంగళవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో కర్నూల్ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ డీఎస్పీ, సీఐలతో సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి ముందే పులివెందుల డీఎస్పీతో బీటెక్ రవి మంతనాలు సాగించినట్లు సమాచారం.
జిల్లాలో అధికార పక్షం ‘అరాచకం–3’కి తెరలేపింది. గతంలో మున్సిపల్, ప్రాదేశిక (ఎంపీటీసీ, జెడ్పీటీసీ) ఎన్నికల నామినేషన్ల వేళ సాగిన దౌర్జన్యాలు, ప్రత్యక్ష దాడులు ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లోనూ పునరావృతమవుతున్నాయి. అధికార పక్షం మాస్టర్ మైండ్‌కు పోలీసు పవర్ జతకట్టడంతో జిల్లాలో కుట్రలు, కుయుక్తులు పరాకాష్టకు చేరాయి. ముఖ్యంగా పులివెందుల సబ్ డివిజన్‌లో అధికార పక్షం క్రిమినల్ ఆలోచనలకు పోలీసు యంత్రాంగం పూర్తిస్థాయిలో తోడ్పాటు అందిస్తోందని వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడుతున్నారు.
ఇదీ చదవండి: జనసేన ‘కోట’ రహస్యం!!.. రూ.7 కోట్ల గూడుపు‘ఠాణా’!


