భూముల సర్వేలో ‘జెండాలు’ | Telangana Govt Key Decision on Land Resurvey | Sakshi
Sakshi News home page

భూముల సర్వేలో ‘జెండాలు’

Nov 21 2026 5:06 AM | Updated on Nov 21 2026 5:06 AM

Telangana Govt Key Decision on Land Resurvey

రెండు రోజుల ముందే పట్టాదారులకు ఇవ్వాలని రెవెన్యూ శాఖ ఆదేశాలు 

భూ విస్తీర్ణంలో తేడా వస్తే తక్షణమే సమాచారం 

సర్వేకు వెళ్లడానికి నాలుగు రోజుల ముందే పట్టాదారులకు నోటీసులు 

సర్వే తర్వాత గ్రామాల్లోనే క్యాంపులు 

రికార్డులు, క్షేత్రంలో ఉన్న భూవిస్తీర్ణంలో తేడాలుంటే గ్రామ పెద్దల సమక్షంలో చర్చలు 

మార్గదర్శకాలు విడుదల చేసిన సీసీఎల్‌ఏ

సాక్షి, హైదరాబాద్‌: భూముల రీసర్వేలో కొత్త ప్రయోగానికి రెవెన్యూ శాఖ తెరతీసింది. పట్టాదారులకు ముందే జెండాలు ఇచ్చి వారి భూమి హద్దుల్లో పాతుకునేందుకు అవకాశం ఇవ్వనుంది. ఆ తర్వాతే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సర్వే నిర్వహించనుంది. పట్టాదారులు చూపే విస్తీర్ణంలోనూ, క్షేత్రస్థాయిలో ఉన్న భూమి విస్తీర్ణంలోనూ తేడా వస్తే వాటిని శాస్త్రీయంగా పరిష్కరించాలని నిర్ణయించింది.

భూముల రీసర్వేలో పాటించాల్సిన ప్రామాణిక కార్యాచరణ విధానంపై భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ డీఎస్‌.లోకేశ్‌కుమార్‌ కలెక్టర్లకు శుక్రవారం సర్క్యులర్‌ పంపారు. సర్వే ప్రారంభం నుంచి రికార్డులకు తుదిరూపు వచ్చేంతవరకు పాటించాల్సిన నిబంధనలను ఇందులో వెల్లడించారు.  

సీసీఎల్‌ఏ విడుదల చేసిన మార్గదర్శకాలివే... 
⇒ ప్రతి గ్రామంలో సర్వే ప్రారంభానికి ముందే భూభారతి పోర్టల్‌ ద్వారా భూముల పహాణీలు, ఫీల్డ్‌ రిజిస్టర్లు అందుబాటులో ఉంచుకోవాలి. వాస్తవంగా ఉన్న దానికి, రికార్డుల్లో ఉన్నదానికి పట్టాదారు వివరాలు, సర్వే, ఖాతా నంబర్లు, భూమి వర్గీకరణ, విస్తీర్ణం తదితర అంశాలను సరిపోల్చుకోవాలి. అవసరమైతే ఈ ఫీల్డ్‌ రిజిస్టర్లలో మార్పులు నమోదు చేయాలి. 

⇒ సర్వేకు 4 రోజుల ముందే తప్పనిసరిగా పట్టాదారుకు నోటీసులివ్వాలి.
⇒ ప్రభుత్వ భూమి సర్వే చేసే ముందు ఫారం–9 నోటీసును గ్రామపంచాయతీ నోటీసు బోర్డులో ప్రకటించాలి. చెరువులు, కుంటలు, అటవీ భూముల సర్వే సమయంలో ఫారం–10 నోటీసులివ్వాలి.
⇒ క్షేత్రస్థాయిలో సర్వే జరగడానికి రెండు రోజుల ముందే రైతులు లేదా యజమానులు లేదా పట్టాదారులకు జెండాలు ఇవ్వాలి. వారి భూమి హద్దుల్లో ఆ జెండాలను ముందే పాతుకోవాలని సూచించాలి.

⇒ సర్వే పూర్తయ్యాక ఆ భూకమతంలో ఎంత విస్తీర్ణం ఉందో వెంటనే పట్టాదారుకు తెలియజేయాలి. భూ రికార్డుకు, క్షేత్రంలో ఉన్న భూమికి తేడా ఉన్నా తెలియజేయాలి. తద్వారా రైతు తన వద్ద రికార్డులను ప్రాథమిక స్థాయిలోనే సమరి్పంచేందుకు అవకాశమివ్వాలి.

⇒ సర్వేలో వచ్చే తేడాలను ఫీల్డ్‌ రిజిస్టర్‌లోని రిమార్క్స్‌ కాలంలో నమోదు చేయాలి.
⇒ క్షేత్రస్థాయిలో సర్వే పూర్తయ్యాక అన్ని వివరాలను భూభారతి పోర్టల్‌ ద్వారా ఆన్‌లైన్‌లో సర్వే టీంలు నమోదు చేయాలి.
⇒ ఈ వివరాలను తహసీల్దార్లు పరిశీలించాలి. ఈ క్రమంలో 8 కేటగిరీల్లో పరిశీలన క్షుణ్ణంగా జరగాల్సి ఉంటుంది. తేడాలు తేలినట్టయితే ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లు తీసుకోవాలి.

⇒ ఆపై అన్ని వివరాలను 3–4 రోజుల పాటు గ్రామాల్లో క్యాంపుల నిర్వహణ ద్వారా నిర్ధారించాలి. రికార్డుల్లోని వివరాలు, క్షేత్రంలో ఉన్న వివరాలు, మ్యాప్‌లు పరిశీలించాకే నిర్ధారణ ప్రక్రియలో ముందుకెళ్లాలి.
⇒ భూమి రికార్డులకు, క్షేత్రంలో ఉన్న భూమి విస్తీర్ణానికి తేడా ఉంటే గ్రామ పెద్దల సమక్షంలో తహసీల్దార్లు చర్చలు జరపాలి. తేడా వచి్చన భూమికి సంబంధించిన పట్టాదారు, ఇరుగుపొరుగు పట్టాదార్లతో కలిసి చర్చలు జరిపి వీలైనంత మేర పరిష్కరించాలి.

⇒ భూమిపై వాస్తవ స్వా«దీనంలో ఉన్న విస్తీర్ణానికి, అధికారిక రికార్డుల్లో నమోదైన విస్తీర్ణానికి మధ్య ఉన్న తేడాలను వీలైనంత వరకు సరిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలి.
⇒ గ్రామంలో క్యాంపుల సందర్భంగా చేసే తీర్మానాలను తహసీల్దార్ల అనుమతితో నమోదు చేయాలి. పూర్తిస్థాయి పరిశీలన తర్వాత చేసే సవరణలకు తహసీల్దార్ల అనుమతి తీసుకొని మండల సర్వేయర్లు తెలంగాణ సర్వే, హద్దుల చట్టం–1923 ప్రకారం నోటీసులు ఇవ్వాలి.
⇒ ఈ నోటీసులను విచారించి పట్టాదారులతో మాట్లాడడంతోపాటు తనిఖీ చేసేందుకు అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ), ఆర్డీఓ స్థాయి అధికారులూ గ్రామాలకు వెళ్లాలి.

⇒ అప్పీళ్లకు తగిన సమయమిచ్చి అన్ని సమస్యలను పరిష్కరించిన తర్వాత మాత్రమే సర్వే శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయాలి. ఆర్డీఓ అనుమతి మేరకు జిల్లా గెజిట్‌లో ఈ వివరాలను పొందుపర్చాలి. తుది నోటిఫికేషన్‌కు అనుగుణంగా తహసీల్దార్లు రికార్డ్‌ ఆఫ్‌ రైట్స్‌ (ఆర్‌ఓఆర్‌)లో మార్పులు నమోదు చేయాలి. ఆ రికార్డులను అప్‌డేట్‌ చేయాలి. ఈ రికార్డులు భూభారతి పోర్టల్‌లోనూ ఆప్‌లోడ్‌ చేయాలి.

మార్గదర్శకాలు తప్పకుండా పాటించాలి: పొంగులేటి
భూముల రీసర్వే కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. భూముల సరిహద్దులు, విస్తీర్ణం, క్షేత్రస్థాయి స్వా«దీనం, రెవెన్యూ రికార్డుల మధ్య ఉన్న వ్యత్యాసాలను శాస్త్రీయంగా, పారదర్శకంగా గుర్తించి, భవిష్యత్‌లో భూ వివాదాలకు ఆస్కారం లేకుండా భూ రికార్డులను రూపొందించడమే రీసర్వే ప్రధాన ఉద్దేశమని శుక్రవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో రైతులే కేంద్ర బిందువుగా ఉండాలని, వారి సమక్షంలోనే భూముల కొలతలు చేపట్టి, ప్రతి దశలో వారికి సమాచారం అందించాలని, సీసీఎల్‌ఏ మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని ఆదేశించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement