వాట్సాప్‌లో KYC చేస్తున్నారా?.. తస్మాత్‌ జాగ్రత్త! | Sharing KYC Documents PAN And Aadhaar On WhatsApp? Here Why You Should Be Careful Of Sharing Personal Documents | Sakshi
Sakshi News home page

వాట్సాప్‌లో KYC చేస్తున్నారా?.. తస్మాత్‌ జాగ్రత్త!

Aug 17 2026 11:35 AM | Updated on Aug 17 2026 12:17 PM

Sharing KYC Documents on WhatsApp Here Why You Should Be Careful

బ్యాంక్ లోన్, క్రెడిట్ కార్డ్, ప్రాపర్టీ కొనుగోలు, హోటల్ బుకింగ్ లేదా ఇతర సేవల కోసం పాన్, ఆధార్, బ్యాంక్ స్టేట్‌మెంట్ వంటి పత్రాలను అడగడం సర్వసాధారణమైపోయింది. అయితే చాలాసార్లు వీటిని వాట్సాప్ ద్వారా పంపండి అని ఏజెంట్ అడిగితే.. ఏ మాత్రం ఆలోచించకుండా పంపిస్తుంటారు. ఇది చాలా ప్రమాదం. ఎందుకో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

డాక్యుమెంట్స్ పంపిస్తే..
మనకు సంబంధించిన డాక్యుమెంట్‌లను ఏజెంటుకు లేదా ఇతర వ్యక్తులకు పంపిస్తే ఏం కాదులే అనుకుంటే పొరపాటే. ఎందుకంటే.. ఆ డాక్యుమెంట్ అవతలి వ్యక్తి ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు లేదా ల్యాప్‌టాప్‌లో సేవ్ చేసుకోవచ్చు. ఆ తరువాత ఆ డాక్యుమెంట్స్ ఎక్కడికి వెళ్తాయో.. ఎన్ని కాపీలు తయారవుతాయో కూడా మనకు తెలియదు. వీటిని ఉపయోగించి కొంతమంది మోసాలకు పాల్పడవచ్చు.

కొన్నిసార్లు బ్యాంక్ లేదా కంపెనీలకు కేవైసీ అవసరం కావొచ్చు. అలాంటి.. సందర్భంలో ఆ కేవైసీని ఒక ఉద్యోగి తన వ్యక్తిగత వాట్సాప్ నెంబర్ ద్వారా సేకరిస్తాడు. ఇది కూడా ఒక సమస్యే అనే విషయం మర్చిపోకూడదు. ఎందుకంటే.. ఆ ఉద్యోగి కంపెనీ మారవచ్చు. లేదా ఉద్యోగం వదిలేయవచ్చు. అలాంటప్పుడు మీ వ్యక్తిగత సమాచారం కంపెనీ అధికారిక వ్యవస్థలో కాకుండా, ఒక వ్యక్తి ఫోనులో ఉంటుంది. తద్వారా భవిష్యత్తులో మీ పత్రాలను తప్పుడు పనులకు ఉపయోగించే అవకాశం ఉంటుంది.

డేటా దుర్వినియోగం అయితే?
పాన్, ఆధార్, బ్యాంక్ స్టేట్‌మెంట్‌లో మన వ్యక్తిగత, ఆర్థిక వివరాలు ఉంటాయి. ఈ సమాచారం తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళితే అనుచిత కాల్స్, మెసేజస్, గుర్తింపు దుర్వినియోగం, ఆర్థిక మోసాలు వంటివి జరగవచ్చు. కాబట్టి వ్యక్తిగత సమాచారం తెలిపే పత్రాల విషయంలో తప్పకుండా జాగ్రత్త వహించాలి.

DPDP చట్టం మనకు ఏం చెబుతోంది?
భారతదేశంలోని డిజిటల్ వ్యక్తిగత డేటా పరిరక్షణ చట్టం (Digital Personal Data Protection Act) ప్రకారం.. వ్యక్తిగత డేటాను బాధ్యతగా సేకరించడం, ఉపయోగించడం, నిర్వహించడం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే, ఒక సంస్థ మీ వ్యక్తిగత సమాచారం తీసుకుంటే దానికి ఒక స్పష్టమైన ఉద్దేశ్యం ఉండాలి, ఆ డేటాను బాధ్యతగా నిర్వహించాలి.

భారతదేశంలో సైబర్ మోసాలు ఎక్కువవుతున్నాయి. ఇలాంటి సమయంలో మీ వ్యక్తిగా సమాచారం పంపించే ముందు తప్పకుండా ఆలోచించాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2024-25 వార్షిక నివేదిక ప్రకారం.. రూ. 36,014 కోట్ల విలువైన 23,953 బ్యాంకింగ్ మోసాల కేసులు నమోదయ్యాయి. దీన్నిబట్టి చూస్తే ప్రజలు ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుస్తోంది.

సురక్షితమైన మార్గం ఏమిటి?
బ్యాంక్స్, హోటల్స్ లేదా ఇతర కంపెనీలకు కొన్నిసార్లు ఐడెంటిటీ వెరిఫికేషన్ నిజంగానే అవసరం కావొచ్చు. అలాంటప్పుడు మీ డాక్యుమెంట్లను వాట్సాప్ నెంబరుకు పంపించకుండా.. అధికారిక వెబ్‌సైట్, సెక్యూర్ అప్లోడ్ పోర్టల్ లేదా డిజిటల్ వెరిఫికేషన్ సిస్టం ద్వారా షేర్ చేయడం మంచిది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. మీ డేటాను ఎవరు తీసుకుంటున్నారు, ఎందుకు తీసుకుంటున్నారు, ఎలా ఉపయోగిస్తున్నారు అనే విషయం మీకు తెలిసి ఉండాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement