అమెరికాకు చెందిన ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్‌పై అమెరికా కార్మిక శాఖ (డీవోఎల్) చర్యలు తీసుకుంది. వలస కార్యక్రమాల్లో మోసపూరిత విధానాలకు పాల్పడిందన్న ఆరోపణల నేపథ్యంలో సంస్థ దాఖలు చేసే ‘పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్’ (పీఈఆర్‌ఎం) కొత్త దరఖాస్తులను నిలిపివేసింది. ఉద్యోగి ఆధారిత గ్రీన్‌కార్డు ప్రక్రియలో పీఈఆర్‌ఎం మొదటి కీలక దశ. కార్మిక శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆంథొనీ డి ఎస్పోసిటో ఎక్స్‌లో కొన్ని విషయాలు వెల్లడించారు.
‘అమెరికన్ కార్మికులకు ముప్పు వాటిల్లితే సహించం. వైట్‌హౌస్ ఫ్రాడ్ టాస్క్‌ఫోర్స్‌తో కలిసి వాస్తవాలు, మోసాలు, ఆర్థిక లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం’ అని ఆయన పేర్కొన్నారు. అయితే, ఆరోపణల వివరాలను గానీ, ప్రభావితమైన దరఖాస్తుల సంఖ్యను గానీ శాఖ వెల్లడించలేదు. క్లౌడెరా అనే మరో టెక్ కంపెనీపై కూడా సమాంతరంగా దర్యాప్తు జరుగుతున్నట్టు తెలిపారు.
వర్క్‌ఫోర్స్‌ను విస్తారిస్తామన్న కంపెనీ
విజిల్‌బ్లోయర్ల నుంచి అందిన పలు ఫిర్యాదుల ఆధారంగానే ఈ చర్య చేపట్టినట్టు ఎస్పోసిటో మీడియాకు తెలిపారు. అయితే, ఇప్పటికే ఆమోదం పొందిన సర్టిఫికేషన్లపై ఈ నిలిపివేత ప్రభావం ఉండదని, హెచ్-1బీ వీసా కార్యక్రమానికి ఇది వర్తించదని స్పష్టం చేశారు. ఆసక్తికరంగా, ఈ చర్యకు ఒక్కరోజు ముందే కాగ్నిజెంట్ సీఈఓ రవి కుమార్ 1,500 మంది అమెరికన్ కాలేజీ గ్రాడ్యుయేట్లను నియమించుకుంటామని, తమ వర్క్‌ఫోర్స్‌ను 15,000కు విస్తరిస్తామని ప్రకటించడం గమనార్హం.
ఫెడరల్ కోర్టును ఆశ్రయించే అవకాశం
యూఎస్‌సీఐఎస్ గణాంకాల ప్రకారం, కాగ్నిజెంట్ హెచ్-1బీ పిటిషన్ల ఆమోదం 2020లో 9,413 ఉండగా 2026 నాటికి 3,510కి పడిపోయింది. ఇమిగ్రేషన్ న్యాయవాది పూర్వి చోతానీ మాట్లాడుతూ, కొత్త దరఖాస్తులను నిరోధించే అధికారం డీవోఎల్‌కు ఉందా అనే అంశంపై స్పష్టత లేదని, కాగ్నిజెంట్ ఫెడరల్ కోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ పరిణామం భారత ఐటీ నిపుణుల దీర్ఘకాలిక ప్రాజెక్టుల డెలివరీ మోడళ్లను ప్రభావితం చేయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, ఈ అంశంపై కాగ్నిజెంట్, నాస్కామ్ ఇంతవరకూ అధికారికంగా స్పందించలేదు.
ఇదీ చదవండి: పసిడి ధరల్లో కుదుపు.. తులం ఎంతంటే..


