అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది చివరలో ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌ను కలిసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిపారు. ఉత్తరకొరియాతో దౌత్య చర్చలను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఇదే సమయంలో ఉత్తర కొరియా వద్ద 80 నుంచి 120 వరకు అణు వార్‌హెడ్‌లు ఉండొచ్చని దక్షిణ కొరియా అంచనా వేసింది. అణు బాంబును మోసుకెళ్లి పేల్చగల అణ్వాయుధ భాగాలను అణు వార్‌హెడ్‌లు అంటారు.
దక్షిణ కొరియా రక్షణ మంత్రి ఆన్ గ్యూ బ్యాక్ గురువారం ఈ అంచనాను వెల్లడించారు. ఉత్తర కొరియా వద్ద 80 నుంచి 120 అణు వార్‌హెడ్‌లు ఉండొచ్చని ఆయన తెలిపారు. ఈ సంఖ్య ట్రంప్ ఒక రోజు ముందు చెప్పిన అణ్వాయుధాల కంటే గణనీయంగా ఎక్కువ. ఉత్తర కొరియా వద్ద 57 చాలా శక్తిమంతమైన అణ్వాయుధాలు ఉన్నాయని ట్రంప్ చెప్పారు.
పార్లమెంటరీ కమిటీ ముందు ఆన్ మాట్లాడుతూ.. ఉత్తర కొరియా వద్ద సాధారణంగా 80 నుంచి 120 అణు వార్‌హెడ్‌లు ఉన్నట్లు భావిస్తున్నామని చెప్పారు. అయితే కచ్చితమైన సంఖ్యను నిర్ధారించడం కష్టమని హెచ్చరించారు. అనంతరం ఈ అంచనా ప్రైవేట్ పరిశోధనా సంస్థల నుంచి వచ్చిందని, దక్షిణ కొరియా సైన్యం అధికారికంగా ధ్రువీకరించలేదని స్పష్టం చేశారు.
కిమ్‌ను మళ్లీ కలుస్తానన్న ట్రంప్
కిమ్‌తో మళ్లీ సంబంధాలను ఏర్పరచుకునేందుకు తాను చేసిన ప్రయత్నాలకు ఆయన నుంచి స్పందన వచ్చిందని ట్రంప్ తెలిపారు. ఈ ఏడాది చివరలో ఉత్తర కొరియా నేతను కలుస్తానని భావిస్తున్నట్లు ధ్రువీకరించారు. ఈ వ్యాఖ్యలతో 2018, 2019లో ఇద్దరు నేతలు నిర్వహించిన అపూర్వమైన సమావేశాల తర్వాత మరో ట్రంప్-కిమ్ శిఖరాగ్ర సమావేశంపై ఊహాగానాలు మళ్లీ మొదలయ్యాయి. ఉత్తర కొరియా అణు కార్యక్రమం, ఆంక్షల సడలింపుపై విభేదాలతో ఆ దౌత్య ప్రయత్నాలు చివరకు విఫలమయ్యాయి. ట్రంప్ తన రెండో పదవీకాలంలో కిమ్‌తో మళ్లీ చర్చలను ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నారు.
చర్చల గురించి నాకు తెలియదు: కిమ్ సోదరి
ట్రంప్‌తొ మళ్లీ సంబంధాలు ఏర్పడుతున్నాయన్న ప్రకటనపై ఉత్తరకొరియా నుంచి జాగ్రత్తతో కూడిన స్పందన వచ్చింది. ట్రంప్, కిమ్ మధ్య ఇటీవల ఎలాంటి సంప్రదింపులు జరిగాయో తనకు తెలియదని కిమ్ జాంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ తెలిపారు. దక్షిణ కొరియాతో కలిసి నిర్వహించే సంయుక్త సైనిక విన్యాసాల్లో అమెరికా భాగస్వామ్యాన్ని తగ్గించాలని ట్రంప్ ఆదేశించిన తర్వాత ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ విన్యాసాలను ఉత్తర కొరియాపై వైరంగా ట్రంప్ అభివర్ణించారు. వార్షిక ఉల్చి ఫ్రీడమ్ షీల్డ్ సైనిక విన్యాసాలను 11 రోజుల నుంచి 5 రోజులకు తగ్గించారు. అయితే ఈ మార్పులతో విన్యాసాలు రెచ్చగొట్టే లేదా దూకుడు చర్యలు ఏమీ తగ్గలేదని కిమ్ యో జోంగ్ అన్నారు.
57 అణ్వాయుధాలా?
ట్రంప్ 57 అణ్వాయుధాలు ఉన్నాయని చెప్పడం అసాధారణంగా మారింది. ఎందుకంటే ఉత్తర కొరియా అణ్వాయుధ నిల్వల పరిమాణంపై అమెరికా ప్రభుత్వం అధికారిక అంచనాను బహిరంగంగా వెల్లడించదు. దక్షిణ కొరియా కూడా ఉత్తరకొరియా వద్ద ఉన్న అణ్వాయుధ నిల్వలపై వివరణాత్మక అంచనాలను బహిరంగంగా వెల్లడించకుండా సంప్రదాయంగా వ్యవహరిస్తోంది. ఉత్తర కొరియాను అణ్వాయుధ దేశంగా అధికారికంగా గుర్తించదు.
ప్రయోగిస్తే ప్రపంచం ఏమైపోతుంది?
చిన్న స్థాయి అణు యుద్ధం కూడా ప్రపంచ ఆహార వ్యవస్థను ప్రభావితం చేయగలదని శాస్త్రీయ నమూనాలు సూచిస్తున్నాయి. ఉత్తరకొరియా ఒకవేళ 120 అణు వార్‌హెడ్‌లు ప్రయోగిస్తే ప్రపంచవ్యాప్తంగా అపారమైన ప్రాణనష్టం, ఆహార సంక్షోభం, పర్యావరణ నష్టం సంభవించే అవకాశం ఉంది.
అయితే, ఒక్క అణ్వాయుధమే జనసాంద్రత ఉన్న ప్రాంతంలో పేలితే భారీ ప్రాణనష్టం, మౌలిక వసతుల విధ్వంసం, దీర్ఘకాలిక రేడియేషన్ ప్రభావాలు సంభవించవచ్చు. పెద్ద సంఖ్యలో అణ్వాయుధాలు ఉపయోగిస్తే పేలుళ్ల వల్ల ఏర్పడే పొగ వాతావరణంలోకి చేరి సూర్యకాంతిని తగ్గించవచ్చు. దీనివల్ల ప్రపంచ ఉష్ణోగ్రతలు పడిపోవడం, పంటల దిగుబడి భారీగా తగ్గడం, ప్రపంచవ్యాప్తంగా కరువు ఏర్పడటం వంటి పరిణామాలు సంభవించవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి.
అయితే, ప్రభావాన్ని వార్‌హెడ్‌ల సంఖ్యతో మాత్రమే నిర్ణయించడానికి వీల్లేదు. వాటి పేలుడు శక్తి, ఎక్కడ పేలుతాయి, ఎంతమేర నగరాలు లేదా పారిశ్రామిక ప్రాంతాలు దెబ్బతింటాయి వంటి అంశాలు కూడా కీలకం. వాటిని ప్రయోగిస్తే మానవ నాగరికతకు అత్యంత తీవ్రమైన విపత్తును రావచ్చు.


