
ఏ ఆటలోనైనా రికార్డులు ఉండేదే బద్దలు కొట్టడానికి అంటారు. ఇటీవల జింబాబ్వేతో టెస్టులో క్వాడ్రపుల్ సెంచరీ (400)కి చేరువైన వేళ సౌతాఫ్రికా క్రికెటర్ వియాన్ ముల్దర్ (Wiaan Muldar).. తాను 367 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్న వేళ ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు.
అనంతరం ముల్దర్ మాట్లాడుతూ.. వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా (Brian Lara) పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టడం ఇష్టం లేకే తాను ఈ పనిచేశానని వెల్లడించాడు. అయితే, లారా మాత్రం పైన చెప్పిన విధంగా.. ‘రికార్డులు ఉన్నవి బద్దలు కొట్టడానికే.. ఇంకోసారి ఇలాంటి అవకాశం వస్తే చేజార్చుకోవద్దు’ అని సుతిమెత్తగానే మందలించాడు.
ఏదేమైనా.. ప్రస్తుతానికి అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా లారా ప్రపంచ రికార్డు అలాగే ఉండిపోయింది. మరి క్రికెట్ చరిత్రలో ఎన్నటికీ బ్రేక్ కాని ఇలాంటి టాప్-10 రికార్డులను కలిగి ఉన్న ప్లేయర్లు ఎవరో తెలుసుకుందామా?!
1. సర్ జాక్ హాబ్స్
ఇంగ్లండ్ బ్యాటింగ్ దిగ్గజం సర్ జాక్ హాబ్స్‌ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఏకంగా 61,760 పరుగులు సాధించాడు. ఇందులో 199 సెంచరీలు, 273 అర్ధ శతకాలు ఉన్నాయి. సగటు 50.70. 1905- 1934 మధ్య కాలంలో సర్ జాక్ హాబ్స్ ఈ మేర పరుగుల వరద పారించాడు. ఆధునిక తరంలో ఏ క్రికెటర్ కూడా ఈ ఫీట్‌ను కనీసం టచ్ చేయలేడని చెప్పవచ్చు.
2. సర్ డాన్ బ్రాడ్‌మన్
ఆస్ట్రేలియా లెజెండరీ బ్యాటర్ సర్ బ్రాడ్‌మన్ 52 టెస్టుల్లో కలిపి 6996 పరుగులు సాధించాడు. ఇందులో 5028 పరుగులు 12 డబుల్ సెంచరీల ద్వారా వచ్చినవే. సగటు 99.94. ప్రపంచ క్రికెట్‌లో ఇంత వరకు ఇంత గొప్ప యావరేజ్‌తో టెస్టుల్లో పరుగులు సాధించనేలేదు.
3. ముత్తయ్య మురళీధరన్
శ్రీలంక స్పిన్ దిగ్గజం టెస్టుల్లో 800, వన్డేల్లో 534, టీ20లలో 13 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో అతడు తీసిన వికెట్ల సంఖ్య 1347. ఇప్పట్లోనే కాదు.. కెరీర్ వ్యవధి రోజురోజుకీ తగ్గిపోతున్న ఆధునిక క్రికెట్ యుగంలో ఇక ముందు కూడా ఎవరికీ ఈ మేర వికెట్లు తీయడం సాధ్యంకాదనే చెప్పవచ్చు.
4. సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar)
టీమిండియాకు ఎనలేని గుర్తింపు తెచ్చిన.. ‘మాస్టర్ బ్లాస్టర్’, క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్ 22 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో 463 వన్డేలు ఆడాడు. 49 శతకాలు, 96 హాఫ్ సెంచరీల సాయంతో 18,426 పరుగులు సాధించాడు. అత్యుత్తమ స్కోరు 200 నాటౌట్. ఈ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టడం ఎవరితరం కాకపోవచ్చు.
5. జేసన్ గిల్లెస్పి
బంగ్లాదేశ్‌తో 2006 నాటి టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఫాస్ట్‌బౌలర్ జేసన్ గిల్లెస్పి నైట్ వాచ్‌మన్‌గా టాపార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు. నాటి మ్యాచ్‌లో ఏకంగా 201 పరుగులు సాధించాడు. నైట్ వాచ్‌మన్‌గా వచ్చి ఈ మేర డబుల్ సెంచరీ సాధించిన ఏకైక ఆటగాడు గిల్లెస్పి.
6. రోహిత్ శర్మ
భారత దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మ వన్డేల్లో ఏకంగా మూడు డబుల్ సెంచరీలు సాధించాడు. అత్యుత్తమ స్కోరు 264. శ్రీలంకతో 2014 నాటి మ్యాచ్‌లో రోహిత్ 33 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో ఈ మేర భారీ స్కోరు సాధించాడు. చెక్కుచెదరని ఈ రికార్డుకు దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు.
7. క్రిస్ గేల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో వెస్టిండీస్ స్టార్, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఆర్సీబీ తరఫున పుణె వారియర్స్‌పై భారీ అజేయ శతకం సాధించాడు. 66 బంతుల్లోనే 175 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచాడు. ఐపీఎల్ చరిత్రలో ఇదే ఫాస్టెస్ట్ హయ్యస్ట్ స్కోరు కావడం విశేషం.
8. మిస్బా ఉల్ హక్
పాకిస్తాన్ ఫినిషర్ వన్డేల్లో 5000కు పైగా పరుగులు సాధించాడు. కెరీర్‌లో ఒక్క సెంచరీ కూడా సాధించకుండానే ఈ మైలురాయిని చేరుకున్న ఏకైక క్రికెటర్ మిస్బా ఉల్ హక్.
9. జిమ్ లేకర్
ఇంగ్లండ్ స్పిన్నర్ 1956లో ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో తొమ్మిది.. రెండో ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీశాడు. ఇప్పటి వరకు సింగిల్ టెస్టులో ఏ బౌలర్ కూడా మళ్లీ ఈ ఫీట్‌ను నమోదు చేయలేకపోయాడు.
10. చమిందా వాస్
శ్రీలంక లెఫ్టార్మ్ బౌలర్ చమిందా వాస్ జింబాబ్వేతో మ్యాచ్ సందర్భంగా వన్డేల్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. 2001లో జింబాబ్వేతో వన్డేలో అతడు కేవలం 19 పరుగులు ఇచ్చి.. ఏకంగా ఎనిమిది వికెట్లు కూల్చాడు.
చదవండి: ధోని కాదు!.. ‘ప్రపంచంలో బెస్ట్ వికెట్ కీపర్ అతడే’