
క్రికెట్ వర్గాల్లో గత కొన్ని రోజులుగా ఎక్కువగా వినిపిస్తున్న పేరు వియాన్ ముల్డర్ (Wiaan Mulder). ఈ సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ ఇటీవల జింబాబ్వేతో రెండో టెస్టు సందర్భంగా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. కెప్టెన్‌గా తన తొలి ప్రయత్నంలోనే ఏకంగా 367 పరుగులతో దుమ్ములేపాడు.
కావాలనే క్వాడ్రపుల్ సెంచరీ (400) మిస్..
అజేయ ట్రిపుల్ సెంచరీతో అదరగొట్టి టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ప్రొటిస్ క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలోనే అతడు వెస్టిండీస్ దిగ్గజం బ్రియన్ లారా (Brian Lara) పేరిట క్వాడ్రపుల్ సెంచరీ (400) రికార్డుకు చేరవయ్యాడు. అయితే, అనూహ్యంగా తాను 367 పరుగుల వద్ద ఉండగా ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి ముల్డర్ ఆశ్చర్యపరిచాడు.
లారా వంటి లెజండరీ బ్యాటర్ పేరిటే ఈ రికార్డు ఉండాలని.. అందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. ఈ నేపథ్యంలో ముల్డర్‌పై ప్రశంసలతో పాటు విమర్శల వర్షమూ కురిసింది. రికార్డులు ఉన్నవి బద్దలు కొట్టేందుకేనని. అయినా అతడేమీ 399 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేయదంటూ పలువురు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
లారా రియాక్షన్ ఇదే
తాజాగా ఈ విషయం గురించి వియాన్ ముల్డర్ స్పందించాడు. తన అభిప్రాయంతో లారా ఏకీభవించలేదంటూ ఆసక్తికర విషయం చెప్పాడు. ‘‘నాకు కాస్త విరామం దొరికినపుడు.. బ్రియన్ లారాతో మాట్లాడాను. నీకంటూ సొంత లెగసీ సృష్టించుకోవాలని ఆయన నాతో అన్నాడు.
నీకోసమే నువ్వు ఆడాలని చెప్పాడు. రికార్డులు ఉన్నవి బద్దలు కొట్టడానికేనని... మరోసారి గనుక నేను ఇలా 400కు చేరువగా వస్తే మాత్రం.. అప్పుడు ఆ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దని చెప్పాడు.
నా నిర్ణయం సరైందే
నిజానికి ఇప్పుడు నేను బ్యాటింగ్ కొనసాగించి.. తనకంటే ఎక్కువ స్కోరు చేస్తే సంతోషించేవాడినని నాతో అన్నాడు. ఆయనలో ఉన్న గొప్పదనం అదే. అయితే, ఇప్పటికీ నా నిర్ణయం సరైందేనని నేను భావిస్తున్నా. ఆటను, దిగ్గజాలను గౌరవించడం అన్నిటికంటే ముఖ్యం’’ అని వియాన్ ముల్డర్ సూపర్‌స్పోర్ట్‌తో వ్యాఖ్యానించాడు.
మిస్ చేసుకున్నావు
కాగా వియాన్ ముల్డర్ గురించి మరో విండీస్ దిగ్గజం క్రిస్ గేల్ ఇటీవల మాట్లాడుతూ.. ‘‘అతడు తప్పు చేశాడు. 400 కొట్టేందుకు అతడు ప్రయత్నించి ఉండాల్సింది. అలా అయితేనే కదా.. క్వాడ్రపుల్ సెంచరీ చేసేవాడో లేదో తెలిసేది. కానీ 367 పరుగుల వద్ద ఉన్నపుడు డిక్లేర్ చేశాడు.
తానేం చెప్పదలచుకున్నాడో అది చెప్పేశాడు. జీవితంలో ఒక్కసారి మాత్రమే ఇలాంటి అరుదైన అవకాశాలు వస్తాయి. టెస్టు ఇన్నింగ్స్‌లో 400 రన్స్ మామూలు విషయం కాదు. ఈసారి నువ్వు ఇది మిస్ చేసుకున్నావు’’ అంటూ విమర్శించాడు.
కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ నయా చాంపియన్ సౌతాఫ్రికా రెండు టెస్టులు ఆడేందుకు జింబాబ్వేకు వెళ్లింది. తొలి టెస్టులో కేశవ్ మహరాజ్ సారథ్యంలో.. రెండో టెస్టులో ముల్డర్ కెప్టెన్సీలో ఆతిథ్య జట్టును చిత్తు చేసి 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది.
చదవండి: ప్యాట్ కమిన్స్‌ని సలహా అడిగితే ఏమన్నాడంటే..: నితీశ్ రెడ్డి