
PC: BCCI/X
లార్డ్స్ టెస్టులో టీమిండియా యువ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి తొలిరోజు సత్తా చాటాడు. ఒకే ఓవర్లో ఇంగ్లండ్ ఓపెనర్లు జాక్ క్రాలే (18), బెన్ డకెట్ (23) వికెట్లు కూల్చి భారత్‌కు శుభారంభం అందించాడు. తద్వారా లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ కోసమంటూ నితీశ్ (Nitish Kumar Reddy)ను ఎంపిక చేయడం సరికాదన్న విమర్శకులకు ఆటతోనే బదులిచ్చాడు.

కమిన్స్‌ని సలహా అడిగితే ఏమన్నాడంటే
ఈ నేపథ్యంలో లార్డ్స్ టెస్టు మొదటి రోజు పూర్తయిన అనంతరం నితీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ‘‘ఇక్కడికి వచ్చే ముందే.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ పిచ్ పరిస్థితులలో ఎలాంటి వైరుధ్యాలు ఉంటాయని ప్యాట్ (ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ Pat Cummins)ను అడిగాను.
నాకిదే తొలి ఇంగ్లండ్ పర్యటన కాబట్టి సలహాలు ఇవ్వమన్నాను. అందుకు బదులుగా.. ‘పిచ్ స్వభావంలో పెద్దగా తేడా ఉండదు. అయితే, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నువ్వు బౌలింగ్‌ను మార్చుకోవాల్సి ఉంటుంది’ అని చెప్పాడు’’ అని నితీశ్ రెడ్డి తెలిపాడు.
కాగా ఐపీఎల్‌లో నితీశ్ రెడ్డి సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ జట్టుకు ప్యాట్ కమిన్స్ గత రెండేళ్లుగా కెప్టెన్‌గా ఉన్నాడు. అతడి సారథ్యంలోనే వరుస అవకాశాలు దక్కించుకున్న ఈ ఆంధ్ర పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్.. టీమిండియాలోనూ ఎంట్రీ ఇచ్చి తనను తాను నిరూపించుకుంటున్నాడు.

మా కోచ్ వల్లే ఇదంతా..
ఇక... టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘మోర్నీతో కూడా నా ఆట గురించి చాలానే చర్చించాను. ముఖ్యంగా సరైన లైన్ అండ్ లెంగ్త్‌తో నిలకడగా బౌలింగ్ చేయడంపై దృష్టి సారించాము. గతేడాది కాలంగా ఈ విషయమై కఠినంగా శ్రమించాను.
అందుకు ప్రతిఫలంగా నా బౌలింగ్‌లో రోజురోజుకీ పరిణతి కనిపిస్తోంది. ఇలాంటి కోచ్‌తో కలిసి పనిచేయడం నాకెంతో సంతోషంగా ఉంది. ఆయనతో కలిసి ప్రయాణం చేయడాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నా’’ అని నితీశ్ రెడ్డి కోచ్ పట్ల కృతజ్ఞతాభావం చాటుకున్నాడు.
లార్డ్స్‌లో అమీతుమీ
కాగా ఆండర్సన్-టెండుల్కర్ ట్రోఫీలో భాగంగా భారత జట్టు ఇంగ్లండ్‌తో ఐదు టెస్టులు ఆడుతోంది. ఈ క్రమంలో లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ ఐదు వికెట్ల తేడాతో గెలవగా.. ఎడ్జ్‌బాస్టన్‌లో గిల్ సేన ఈ ఓటమికి దిమ్మతిరిగేలా సమాధానం ఇచ్చింది. స్టోక్స్ బృందాన్ని ఏకంగా 336 పరుగుల తేడాతో చిత్తు చేసి ఈ వేదికపై తొలిసారి గెలుపు నమోదు చేసింది.
ఇక ఇరుజట్ల మధ్య లండన్‌లోని ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో గురువారం (జూలై 10) మూడో టెస్టు ఆరంభమైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ మొదటి రోజు ఆట ముగిసేసరికి.. 83 ఓవర్లలో నాలుగు వికెట్ల నస్టానికి 251 పరుగులు చేసింది. జో రూట్ 99, బెన్ స్టోక్స్ 39 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇక భారత బౌలర్లలో నితీశ్ రెడ్డి రెండు వికెట్లు కూల్చగా.. జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాకు ఒక్కో వికెట్ దక్కాయి.
చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన జో రూట్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
వాట్ రా రెడ్డి, బాగుంది రా మామ👌 #SonySportsNetwork #GroundTumharaJeetHamari #ENGvIND #NayaIndia #DhaakadIndia #TeamIndia #ExtraaaInnings pic.twitter.com/cH9KYukrVX
— Sony Sports Network (@SonySportsNetwk) July 10, 2025