
టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచంలోని అత్యుత్తమ వికెట్ కీపర్‌గా భారత మాజీ ఆటగాడి పేరు చెప్పాడు. అయితే, అభిమానులు ఊహిస్తున్నట్లు మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni)పేరు మాత్రం కాదు.
స్టంప్డ్
భారత మాజీ క్రికెటర్ సయ్యద్ కీర్మాణి (Syed Kirmani) ‘స్టంప్డ్: లైఫ్ బిహైండ్ అండ్ బియాండ్ ట్వంటీ-టూ యార్డ్స్’ పేరిట తన ఆటోబయోగ్రఫీ పుస్తకాన్ని తీసుకువచ్చాడు. హైదరాబాద్‌లో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించగా.. భారత క్రికెట్ దిగ్గజాలు కపిల్ దేవ్, మహ్మద్ అజారుద్దీన్ సహా టీమిండియా యువ పేసర్ మహ్మద్ సిరాజ్ తదితరులు హాజరయ్యారు.
ప్రపంచంలోని అత్యుత్తమ వికెట్ కీపర్ అతడే
ఈ సందర్భంగా అజారుద్దీన్ మాట్లాడుతూ.. ‘‘ప్రపంచంలోని అత్యుత్తమ వికెట్ కీపర్ సయ్యద్ కీర్మాణి. అలాంటి వికెట్ కీపర్ మరొకరు ఇంకా పుట్టనేలేదు. ముఖ్యంగా నలుగురు స్పిన్నర్లు ఉన్న జట్టులో వికెట్ కీపర్‌గా ఉండటం అంటే మాటలు కాదు.
1983 వన్డే వరల్డ్‌కప్‌లోనూ అతడు ఎన్నో అత్యుత్తమ క్యాచ్‌లు అందుకున్నాడు. జింబాబ్వేపై కపిల్ దేవ్ 175 పరుగులు చేసిన మ్యాచ్‌లోనూ.. కీర్మాణి 24 పరుగులు సాధించాడు. ఆ మ్యాచ్‌లో ఆ పరుగులు కూడా ఎంతో కీలకం.

ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఆ దేవుడు ఆయనకు దీర్ఘకాల ఆయుష్షును ప్రసాదించాలి. పాఠకుల నుంచి ఈ పుస్తకానికి మంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నా. తన ఆటోబయోగ్రఫీ పుస్తకం విజయవంతమైన బుక్స్‌లిస్టులో చేరాలి’’ అని ఆకాంక్షించాడు.
మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన సారథి
కాగా ప్రపంచంలోని అత్యుత్తమ వికెట్ కీపర్ బ్యాటర్‌గా మహేంద్ర సింగ్ ధోని పేరొందాడు. భారత్‌కు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఈ దిగ్గజ సారథి.. ఆటగాడిగానూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.
అయితే, అజారుద్దీన్ మాత్రం బెస్ట్ వికెట్ కీపర్‌గా సయ్యద్ కీర్మాణి పేరు చెప్పడం విశేషం. ఆయన తర్వాత కూడా అంతటి గొప్ప వికెట్ కీపర్ మరెవరూ జన్మించలేదనడం గమనార్హం. కాగా 1983 వన్డే వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టులో సయ్యద్ కీర్మాణి సభ్యుడు.
చదవండి: ‘అంబానీని అగార్కర్ ఒప్పించాల్సింది.. నేనైతే అలాగే చేస్తా’