
టీమిండియా యాజమాన్యం వ్యవహారశైలిపై భారత మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్‌సర్కార్ (Dilpi Vensarkar) విమర్శలు చేశాడు. ఐపీఎల్ కంటే జాతీయ జట్టు వైపే మొగ్గుచూపేలా ఆటగాళ్లను ప్రేరేపించాలని సూచించాడు. ఇందుకోసం సెలక్టర్లే రంగంలోకి దిగి ఫ్రాంఛైజీల యజమానులను ఒప్పించే బాధ్యత తీసుకోవాలన్నాడు.
ఒకవేళ సెలక్షన్ కమిటీ ఇలా చేసి ఉంటే.. ఇంగ్లండ్ గడ్డ మీద ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా (Jaspri Bumrah) ఐదు టెస్టులూ ఆడేవాడని వెంగ్‌సర్కార్ అభిప్రాయపడ్డాడు. కాగా ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ ఆడేందుకు టీమిండియా ఇటీవల ఇంగ్లండ్‌లో పర్యటించిన విషయం తెలిసిందే.
మూడు టెస్టులే ఆడతాడు
అయితే, ఈ సిరీస్ ఆరంభానికి ముందే తమ ప్రధాన పేసర్ బుమ్రా ఐదింటిలో కేవలం మూడు టెస్టులే ఆడతాడని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టం చేశాడు. బుమ్రాపై పనిభారం తగ్గించే దృష్ట్యా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. ఈ విషయంలో హెడ్‌కోచ్ గౌతం గంభీర్, కెప్టెన్ శుబ్‌మన్ గిల్ కూడా అగార్కర్‌తో ఏకీభవించారు.
అందుకు తగ్గట్లుగానే బుమ్రా మొదటి, మూడు, నాలుగో టెస్టుల్లోనే భాగమయ్యాడు. అనంతరం ఫిట్‌నెస్ సమస్యల దృష్ట్యా ఐదో టెస్టు ఆరంభమైన అనంతరం అతడిని జట్టు నుంచి విడుదల చేశారు. ఈ నేపథ్యంలో పనిభారం అంటూ ప్రధాన ఆటగాళ్లు జట్టుకు దూరమైతే టీమిండియా భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుందంటూ భారత మాజీ క్రికెటర్లు బీసీసీఐ తీరును విమర్శిస్తున్నారు.
టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ దిలీప్ వెంగ్‌సర్కార్ కూడా తాజాగా ఈ జాబితాలో చేరాడు. ‘‘ఇంగ్లండ్‌తో ఐకానిక్ టెస్టు సిరీస్ మనకు ఎంత ముఖ్యమైనదో బీసీసీఐ, సెలక్టర్లు, మేనేజ్‌మెంట్ బుమ్రాకు అర్థమయ్యేలా చెప్పి ఉండాల్సింది. ఐపీఎల్-2025కి దూరంగా ఉండమని సూచించి ఉంటే బాగుండేది.
అంబానీని అగార్కర్ ఒప్పించాల్సింది.. నేనైతే అలాగే చేస్తా
ఇలాంటి ప్రతిష్టాత్మక సిరీస్‌కు ముందు బుమ్రా వంటి ప్రధాన ఆటగాడు ఫిట్‌గా ఉండటం అన్నికంటే ముఖ్యమైనది. ఒకవేళ నేనే గనుక ఇప్పుడు టీమిండియా చీఫ్ సెలక్టర్ అయి ఉంటే.. ఇంగ్లండ్ సిరీస్ కోసం బుమ్రాను ఐపీఎల్‌కు దూరంగా ఉంచమని ముకేశ్ అంబానీని ఒప్పించేవాడిని.
అలా వీలుపడదంటే కనీసం అతడు ఆడే మ్యాచ్‌ల సంఖ్యనైనా తగ్గించమని చెప్పేవాడిని. నాకు తెలిసి వాళ్లు కూడా అందుకు తప్పక అంగీకరించేవారు. నాలుగేళ్లకోసారి వచ్చే ఇలాంటి సిరీస్ కోసం టీమిండియా పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలి కదా!
నాకు తెలిసి 2027 జనవరి వరకు టీమిండియా మరోసారి ఇలాంటి ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడబోవడం లేదు. తరతరాల పాటు నిలిచిపోయే ఇలాంటి సిరీస్‌లో బుమ్రా ఐదు మ్యాచ్‌లు ఆడి ఉంటే బాగుండేది. మనం సిరీస్ గెలిచేవాళ్లమేమో కూడా!’’ అని దిలీప్ వెంగ్‌సర్కార్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.
2-2తో సమం
కాగా ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీని టీమిండియా 2-2తో సమం చేసింది. మరోవైపు.. ఆడిన మూడు టెస్టుల్లో బుమ్రా మొత్తంగా 14 వికెట్లు తీశాడు. హెడింగ్లీ, లార్డ్స్ టెస్టుల్లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. అయితే, ఈ రెండు మ్యాచ్‌లలో టీమిండియా ఇంగ్లండ్ చేతిలో ఓడిపోవడం గమనార్హం.
ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ తరఫున బుమ్రా 12 మ్యాచ్‌లు ఆడి 18 వికెట్లు కూల్చాడు. ఇక ఆసియా కప్-2025 టీ20 టోర్నీకి కూడా అతడు అందుబాటులో ఉండే పరిస్థితి కనిపించడం లేదు.
చదవండి: మరోసారి చెలరేగిపోయిన టీమిండియా యువ సంచలనం.. 119 పరుగులు, 10 వికెట్లు