
టీమిండియా యువ సంచలనం ముషీర్ ఖాన్ ఇటీవలికాలంలో ప్రతి మ్యాచ్‌లో చెలరేగిపోతున్నాడు. బ్యాట్‌తో పాటు బంతితోనూ ఇరగదీస్తున్నాడు. కొద్ది రోజుల కిందట ఇంగ్లండ్ పర్యటనలో హ్యాట్రిక్ సెంచరీలు సహా ఓ 10 వికెట్ల ప్రదర్శన (మ్యాచ్ మొత్తంలో), ఓ 6 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన ఈ ముంబై కుర్రాడు.. తాజాగా ముంబైలోనే జరుగుతున్న ప్రతిష్టాత్మక కంగా లీగ్‌లో మరోసారి ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఔరా అనిపించాడు.
ఈ లీగ్‌లోని ఓ మ్యాచ్‌లో ముషీర్ తొలి ఇన్నింగ్స్‌లో 84 పరుగులు, 3 వికెట్లు (8 పరుగులకే).. రెండో ఇన్నింగ్స్‌లో 35 (నాటౌట్) పరుగులు, 7 వికెట్లు (4 పరుగులకే) తీశాడు. ఈ మ్యాచ్ మొత్తంలో అతను 119 పరుగులతో పాటు 10 వికెట్లు సాధించాడు.
ఇటీవలికాలంలో ముషీర్ ప్రదర్శనలు చేస్తుంటే త్వరలోనే టీమిండియా తలుపులు తట్టేలా ఉన్నాయి. 20 ఏళ్ల ముషీర్ మరో టీమిండియా యువ కెరటం సర్ఫరాజ్ ఖాన్‌కు స్వయానా తమ్ముడు. సర్ఫరాజ్ కూడా అదిరిపోయే ప్రదర్శనలతో భారత టెస్ట్ అరీనా చుట్టూ ఉన్నాడు. అయితే సీనియర్లు క్రియాశీలకంగా ఉండటంతో అతనికి సరైన అవకాశాలు రావడం లేదు.
టీమిండియాలో స్థిరపడటానికి అన్న సర్ఫారాజ్‌తో పోల్చుకుంటే తమ్ముడు ముషీర్‌కు మెరుగైన అవకాశాలు ఉన్నాయి. ముషీర్ రైట్ హ్యాండ్ బ్యాటింగ్‌తో పాటు అదిరిపోయే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్ చేస్తాడు.
ముషీర్‌కు దేశవాలీ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. 2022-23 రంజీ సీజన్‌లో ముంబై తరఫున అరంగేట్రం చేసిన ముషీర్.. ఆడిన 9 మ్యాచ్‌ల్లో 51.14 సగటున 3 సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 716 పరుగులు చేశాడు. ఇందులో ఓ అజేయ డబుల్ సెంచరీ కూడా ఉంది.
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ముషీర్ బౌలర్‌గానూ రాణించాడు. 9 మ్యాచ్‌ల్లో 8 వికెట్లు తీశాడు. ముషీర్ 2024 అండర్-19 వరల్డ్‌కప్‌లో భారత జట్టు సభ్యుడు. టీమిండియా రన్నరప్‌గా నిలిచిన ఆ టోర్నీలో ముషీర్ రెండు సెంచరీలు చేశాడు. 2024 రంజీ ఫైనల్లో సెంచరీ చేసిన ముషీర్.. ముంబై తరఫున రంజీ ఫైనల్లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు.
కాగా, ముషీర్ ఇటీవల ముంబై క్రికెట్ అసోసియేషన్ ఎమర్జింగ్ టీమ్ (MCA Colts) తరఫున ఇంగ్లండ్‌లో పర్యటించాడు. ఈ పర్యటనలో Notts 2nd XIతో జరిగిన తొలి మ్యాచ్‌లో 127 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో 123 పరుగులు చేసిన ముషీర్.. ఆ మ్యాచ్‌లో బౌలింగ్‌లోనూ ఇరగదీసి 6 వికెట్లు ప్రదర్శన నమోదు చేశాడు.
అనంతరం జులై 3న ఛాలెంజర్స్‌తో (కంబైన్డ్ నేషనల్ కౌంటీస్) జరిగిన రెండో మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ (127 బంతుల్లో 125; 11 ఫోర్లు, సిక్స్) చేసిన ముషీర్.. బౌలింగ్‌లోనూ చెలరేగి ఆ మ్యాచ్ మొత్తంలో పది వికెట్లు (తొలి ఇన్నింగ్స్‌లో 6, రెండో ఇన్నింగ్స్‌లో 4) తీశాడు.
జులై 10న ముషీర్ లౌబరో UCCE జట్టుతో జరిగిన మ్యాచ్‌లో మరోసారి సెంచరీతో కదంతొక్కాడు. ఈ మ్యాచ్‌లో ముషీర్ 146 బంతుల్లో 22 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 154 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు.