సాక్షి,హైదరాబాద్: వచ్చే వారంలో ప్రారంభమయ్యే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సుదీర్ఘకాలం తర్వాత మళ్లీ యాక్టివ్ అయిన బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనబోతున్నట్లు సమాచారం. ఈ అంశంపై బీఆర్‌ఎస్ అధికారిక ప్రకటన వెలువడనుంది.
శుక్రవారం పార్టీ నేతలతో కేసీఆర్ నిర్వహించిన కీలక సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ప్రధానంగా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై చర్చ జరిగింది. సమావేశంలో నేతలతో పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల అనంతరం ప్రజల్లోకి వెళ్లి బహిరంగ సభలు నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే సోమవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాలని, అసెంబ్లీ వేదికగా నీటి విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.
తెలంగాణ నీటి హక్కులను పరిరక్షించుకునే బాధ్యత బీఆర్‌ఎస్‌పైనే ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. అసెంబ్లీ వేదికలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల విషయంలో ఈ రెండు ప్రభుత్వాల వైఖరి కారణంగా తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ గతంలోనూ తెలంగాణకు ద్రోహం చేసిందని ఆరోపించారు. తెలంగాణ కోసం బీఆర్‌ఎస్ తప్ప మరే ఇతర పార్టీకి పట్టింపు లేదని స్పష్టం చేశారు.


