బెంగళూరులో బుల్డోజర్‌తో ముస్లింల ఇళ్లు నేలమట్టం !
కర్ణాటక సర్కారుపై కేరళ సీఎం పినరయి విమర్శలు
రాజకీయ జిమ్మిక్కులు వద్దు: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే
బనశంకరి: కర్ణాటక, కేరళ మధ్య తాజాగా చిచ్చు రేగింది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజరుతో ముస్లింల ఇళ్లను నేలమట్టం చేశారని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆరోపించడమే కారణం. బెంగళూరు యలహంకలోని కోగిలు లేఅవుట్ వద్ద ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా నిర్మించిన ఇళ్లను గ్రేటర్ బెంగళూరు అథారిటీ అధికారులు నాలుగు రోజుల క్రితం కూల్చివేశారు.
ఈ విషయమై విజయన్ శుక్రవారం సోషల్ మీడియాలో పోస్టు చేశారు. బెంగళూరు ఫకీర్ కాలనీ, వసీం లేఅవుట్‌లో కొన్నేళ్లుగా నివాసం ఉంటున్న ముస్లింల ఇళ్లను బుల్డోజర్‌తో ధ్వంసం చేయడం దిగ్భ్రాంతికరమన్నారు. ఉత్తరప్రదేశ్‌లో సంఘపరివార్ సర్కారు అనుసరిస్తున్న మైనారిటీ వ్యతిరేక ధోరణి కర్ణాటకలో కూడా కనిపిస్తోందన్నారు. కాంగ్రెస్ కపట ప్రవృత్తిని సెక్యులర్ ప్రజాస్వామ్య శక్తులు ఏకమై ఎండగట్టాలన్నారు.
రాజకీయ జిమ్మిక్కులు వద్దు: డిప్యూటీ సీఎం డీకే
కేరళలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పినరయి విజయన్ రాజకీయ జిమ్మిక్కులు చేయవద్దని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ధ్వజమెత్తారు. శనివారం ఆయన స్పందిస్తూ.. ‘‘సీనియర్ నేత పినరయి విజయన్ వాస్తవాలను తెలుసుకోకుండా మాట్లాడారు. కొందరు ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నివాసం ఉండడంతో మా ఎమ్మెల్యేలు, అధికారులు వాటిని తొలగించామని చెప్పారు.
మాకు బెంగళూరు గురించి బాగా తెలుసు.. ఎవరు ఇళ్లు కోల్పోయినా వారికి రాజీవ్‌గాంధీ వసతి గృహమండలి ద్వారా ఇళ్లు కేటాయిస్తాం. మేము బుల్డోజర్ పద్ధతిని ఉపయోగించలేదు’’ అని తెలిపారు. విజయన్ ఇక్కడి పరిస్థితిని అర్థం చేసుకోకుండా మాట్లాడడం సరికాదని, ఎవరైనా ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే వదిలేది లేదని డీకే స్పష్టం చేశారు.


