
ఆస్ట్రేలియా గడ్డపై భారత యువ సింహాలు (India U19 Team) గర్జించాయి. వరుసగా వన్డే, టెస్ట్ సిరీస్‌ల్లో ఆతిథ్య జట్టును (Australia U19 Team) క్లీన్ స్వీప్ చేశాయి. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ల కోసం ఆస్ట్రేలియాలో పర్యటించిన యువ భారత్.. వన్డే సిరీస్‌ను 3-0తో, టెస్ట్ సిరీస్‌ను 2-0తో ఊడ్చేసింది.
మెక్‌కే వేదికగా ఇవాళ (అక్టోబర్ 8) ముగిసిన రెండో టెస్ట్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు మూకుమ్మడిగా చెలరేగడంతో ఆస్ట్రేలియా కుర్ర జట్టు బెంబేలెత్తిపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో 135 పరుగులకే కుప్పకూలింది. భారత్ సైతం తొలి ఇన్నింగ్స్‌లో 171 పరుగులకే ఆలౌటైనా.. 36 పరుగుల కీలక ఆధిక్యం సాధించింది.
అనంతరం భారత బౌలర్లు మరోసారి చెలరేగిపోయారు. ఈసారి ఆసీస్‌ను 116 పరుగులకే (రెండో ఇన్నింగ్స్‌లో) కుప్పకూల్చారు. తద్వారా భారత్ ముందు నామమాత్రపు 81 పరుగుల లక్ష్యం ఉండింది.
స్వల్ప ఛేదనలో భారత్ సైతం ఆదిలో తడబడింది. 13 పరుగుల వద్దే కెప్టెన్ ఆయుశ్ మాత్రే (13) వికెట్ కోల్పోయింది. ఆతర్వాత బంతికే స్టార్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ డకౌటయ్యాడు. ఈ దశలో వేదాంత్ త్రివేది, విహాన్ మల్హోత్రా భారత ఇన్నింగ్స్‌ను నిర్మించే ప్రయత్నం చేశారు.
అయితే 52 పరుగుల వద్ద విహాన్ (21) కూడా ఔటయ్యాడు. ఈసారి వేదాంత్ (33 నాటౌట్) మరో ఛాన్స్ తీసుకోకుండా రాహుల్ కుమార్ (13 నాటౌట్) సహకారంతో భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు.
రెండు ఇన్నింగ్స్‌ల్లో విఫలమైన వైభవ్
ఈ మ్యాచ్‌లో టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ రెండు ఇన్నింగ్స్‌ల్లో విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో (14 బంతుల్లో 20; 2 ఫోర్లు, సిక్స్) మంచి ఆరంభం లభించినా భారీ స్కోర్‌గా మలచలేకపోయిన ఈ కుర్ర డైనమైట్.. రెండో ఇన్నింగ్స్‌లో ఎదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యాడు.
చెలరేగిన బౌలర్లు
ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు రెండు ఇన్నింగ్స్‌ల్లో చెలరేగిపోయారు. కలిసికట్టుగా బౌలింగ్ చేసి ఆసీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. వీరి ధాటికి ఆసీస్ బ్యాటర్లు కొద్ది సేపు కూడా క్రీజ్‌లో నిలబడలేకపోయారు.
రెండు ఇన్నింగ్స్‌ల్లో ఆసీస్ తరఫున అలెక్స్ లీ యంగ్ (66, 38) ఒక్కడే పర్వాలేదనిపించాడు. ఈ మ్యాచ్‌లో హెనిల్ పటేల్ 6, ఖిలన్ పటేల్, ఉధవ్ మోహన్ తలో 4, నమన్ పుష్పక్ 3, దీపేశ్ దేవేంద్రన్ 2 వికెట్లు తీశారు.
చదవండి: CEAT అవార్డుల విజేతలు వీరే.. రోహిత్ శర్మకు ప్రత్యేక పురస్కారం