
ఆస్ట్రేలియా పర్యటనలో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన యువ భారత్ (అండర్ 19 జట్టు).. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇవాల్టి నుంచి (సెప్టెంబర్ 30) మొదలైన తొలి టెస్ట్‌లోనూ సత్తా చాటింది. బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో భారత బౌలర్లు చెలరేగిపోయారు. ముఖ్యంగా యువ పేసర్ దీపేశ్ దేవేంద్రన్ (16.2-6-45-5) ఐదు వికెట్ల ప్రదర్శనతో ఆసీస్ ఇన్నింగ్స్ పతనాన్ని శాశించాడు.
మరో పేసర్ కిషన్ కుమార్ (16-4-48-3) కూడా సత్తా చాటాడు. అన్మోల్జీత్ సింగ్, ఖిలన్ పటేల్ తలో వికెట్ తీశారు. ఫలితంగా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 91.2 ఓవర్లలో 243 పరుగులకే ఆలౌటైంది.
ఆసీస్ ఇన్నింగ్స్‌లో వన్ డౌన్ బ్యాటర్ స్వీవెన్ హోగన్ (246 బంతుల్లో 92) ఒక్కడే రాణించాడు. మిగతా ఆటగాళ్లలో జెడ్ హోలిక్ (38) మాత్రమే 20కి పైగా స్కోర్ చేశాడు. అలెక్స్ లీ యంగ్ (18), కెప్టెన్ విల్ మలాజ్‌చుక్ (21), సైమన్ బడ్జ్ (15) జాన్ జేమ్స్ (13), హేడన్ షిల్లర్ (10 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. ఆసీస్ ఇన్నింగ్స్ ముగియగానే తొలి ఆట ముగిసింది.
రేపు భారత ఇన్నింగ్స్ మొదలవుతుంది. ఆసీస్‌తో పోలిస్తే భారత బ్యాటింగ్ లైనప్ చాలా పటిష్టంగా ఉంది. చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీతో అప్ కమింగ్ స్టార్ ఆయుశ్ మాత్రే ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తారు. ఆతర్వాత విహాన్ మల్హోత్రా, వేదాంత్ త్రివేది, రాహుల్ కుమార్, అభిగ్యాన్ కుందు లాంటి స్టార్ బ్యాటర్లు ఉన్నారు.
కాగా, భారత అండర్-19 జట్టు ఈ సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌ను కూడా వారి సొంత ఇలాకాలో మట్టికరిపించింది. ఇటీవలికాలంలో యువ భారత్ విజయాల్లో వైభవ్ సూర్యవంశీ ప్రధానపాత్ర పోషిస్తున్నాడు. తాజాగా ఆసీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లోనై వైభవ్ పర్వాలేదనిపించాడు.
చదవండి: హైదరాబాద్‌లో సందడి చేసిన ఆసియా కప్ ఫైనల్ హీరో