
సెప్టెంబర్ 28న పాకిస్తాన్‌తో జరిగిన ఆసియా కప్ 2025 ఫైనల్లో (Asia Cup 2025) చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడి భారత్‌ను ఒంటిచేత్తో గెలిపించిన హైదరాబాదీ స్టార్ తిలక్ వర్మ (Tilak Varma).. ఇవాళ నగరంలో సందడి చేశాడు. తాను చిన్నతనంలో శిక్షణ పొందిన లేగాలా క్రికెట్ అకాడమీని (Legala Cricket Academy) సందర్శించాడు.
తిలక్‌ను చూసేందుకు క్రికెట్ అభిమానులు ఎగబడ్డారు. తిలక్‌కు, అతని కోచ్ సలామ్ బయాష్‌కు అకాడమీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా తిలక్ మాట్లాడుతూ.. ఆసియా కప్ ఫైనల్లో టీమిండియా గెలవడం చాలా సంతృప్తినిచ్చింది. ఆ మ్యాచ్‌లో టీమిండియాను గెలిపించడమే టార్గెట్‌గా పెట్టుకొని ఆడాను. ఆ సమయంలో మా కళ్ల ముందు దేశమే కనిపించింది. నేను ఆడిన ఇన్నింగ్స్‌లలో ఇదే అత్యుత్తమమైంది.

ఫైనల్లో పాక్ ఆటగాళ్ల స్టెడ్జింగ్ మాపై ఏమాత్రం ప్రభావం చూపలేదు. విరాట్ కోహ్లి నాకు ఎంతో స్పూర్తినిచ్చాడు. విరాట్ కోహ్లితో నన్ను పోల్చడం గర్వంగా ఉందని అన్నాడు.
కాగా, 23 ఏళ్ల తిలక్‌కు లెగాలా క్రికెట్ అకాడమీనే పునాది. లింగంపల్లి ప్రాంతంలో ఉన్న ఈ అకాడమీ తిలక్‌కు క్రికెట్‌లో తొలి పాఠాలు నేర్పింది. కోచ్ సలాం బయాష్ మార్గదర్శకత్వంలో తిలక్ 11 ఏళ్ల వయసులోనే ప్రతిభను చాటాడు. తిలక్ ఇంటి నుంచి అకాడమీకి రోజూ 40 కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి వచ్చేది.

కోచ్ సలాం బయాష్ తిలక్‌ను స్వయంగా తన వాహనంలో తీసుకొచ్చి, తిరిగి ఇంటికి చేర్చేవాడు. 2020లో తిలక్ అండర్-19 వరల్డ్‌కప్‌కు ఎంపిక కావడంలో అకాడమీ పాత్ర చాలా కీలకం. తిలక్ టీమిండియాకు ఎంపికయ్యే వరకు వారానికి నాలుగు రోజుల పాటు అకాడమీకి వెళ్లేవాడు. ఆసియా కప్ హీరోయిక్స్ తర్వాత తిలక్ హైదారాబాద్ యువతకు స్పూర్తిగా మారాడు.
చదవండి: టీమిండియాకు బ్యాడ్ న్యూస్